Monday, December 23, 2024

రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలి: రైతుల దర్నా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/కోరుట్ల రూరల్: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడానికి రైస్ మిల్లర్లు అనేక అవస్థలు పెట్టడమే కాకుండా తూకంలో దోపిడికి గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కోరుట్ల మున్సిపల్ విలీన గ్రామమైన ఎఖీన్‌పూర్ లో రైస్ మిల్లర్ల దోపిడి నుండి రైతులను కాపాడాలని డిమాండ్ చేస్తు పెద్ద ఎత్తున దర్నా నిర్వహించారు. గ్రామంలో ఉన్న రైస్ మిల్లును సీజ్ చేస్తు, యజమానిని అరెస్టు చేయాలని రైతులు ఆందోళనకు దిగారు. కలెక్టర్, ఆర్డీవో రావాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసి రికార్డులు సరిగా లేక పోవడంతో కొనుగోలు కేంద్ర నిర్వాహకునిపై కేసు నమోదు చేయాలని, సింగిల్ విండో సిఈవోను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

అయితే రైతులు నేరుగా గ్రామంలో ఉన్న రైస్ మిల్ యజమానితో తూకంలో ఒప్పందం కుదుర్చుకోగా, ముందుగా కుదుర్చుకున్న ఒప్పందాన్ని మిల్లు యజమాని తుంగలో తొక్కి తూకంలో మోసం చేయడంతో రైతులు దర్నాకు దిగినట్లు తెలిసింది. మండలంలోని అన్ని రైస్ మిల్లుల్లో ఇదే తంతు కొనసాగుతుందని రైతులు పేర్కొంటున్నారు. రైస్ మిల్లర్ల వైఖరీ మారకుంటే మరిన్ని గ్రామాల్లో రైతులు దర్నాకు దిగే అవకాశాలు లేకపోలేదు. తహశీల్దార్ నీరటి రాజేష్, ఎస్సైలు సతీష్ కుమార్, శ్యాం రాజ్ రైతులతో మాట్లాడి శాంతింపజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News