లాఠీచార్జీలో పలువురికి తీవ్ర గాయాలు
ఖండించిన ఎస్‌కెఎం, కాంగ్రెస్
చండీగఢ్: శనివారం హర్యానాలో రైతులు పలు చోట్ల నిరసనలకు దిగారు. ఆ సందర్భంగా పోలీసులు జరిపిన లాఠీచార్జీల్లో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. రైతులు రక్తంతో తడిసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మొదట కర్నాల్ జిల్లాలో రైతులు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ఖట్టర్ హాజరయ్యే ఓ కార్యక్రమం సందర్భంగా నిరసన చేపట్టగా పోలీసులు వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఇతర జిల్లాల్లోని రైతులు కూడా నిరసనలకు దిగారు. జలియన్‌వాలాబాగ్ మెమోరియల్‌ను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించే కార్యక్రమానికి కూడా నిరసన సెగ తగిలింది. అమృత్‌సర్‌లో నిరసన చేపట్టిన రైతులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
రైతుల నిరసనల వల్ల ఎన్‌హెచ్3, ఢిల్లీఅమృత్‌సర్, పంచకులసిమ్లా రహదారుల్లో ట్రాఫిక్ జామైంది. మూడు కిలోమీటర్లమేర వాహనాలు నిలిచిపోయాయి. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను హర్యానా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైతులపై జరిగిన లాఠీచార్జీని సంయుక్త కిసాన్‌మోర్చా(ఎస్‌కెఎం)తోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఖండించారు. రైతులపై లాఠీచార్జి క్రూరమైన చర్యగా మోర్చా మండిపడింది. రైతులపై హింసకు పాల్పడటం సిగ్గుపడాల్సిన విషయమని రాహుల్ ట్విట్ చేశారు. రైతుల రక్షణ పట్ల బిజెపికి ఎంత అశ్రద్ధో కర్నాల్‌లో జరిగిన సంఘటనే నిదర్శనమని కాంగ్రెస్ హర్యానా చీఫ్ కుమారిసెల్జా అన్నారు.