Thursday, December 19, 2024

చలో ఢిల్లీ: బుల్ డోజర్లు, పొక్లెయినర్లతో ఢిల్లీ దిశగా రైతులు!

- Advertisement -
- Advertisement -

రైతుల చలో ఢిల్లీ ఆందోళన బుధవారంనుంచీ మళ్ళీ ప్రారంభం కావడంతో శంభు సరిహద్దుల వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సరిహద్దుల వద్ద మోహరించిన వేలాదిమంది రైతులు బుధవారం ఉదయం ఒక్కసారిగా ముందుకు కదలడంతో వారిని ఆపేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. రైతులు భారీయెత్తున పొక్లెయినర్లు, బుల్ డోజర్లు, జేసీబీలతో ముందుకు కదులుతున్నారు. శంభు, ఖనౌరీ సరిహద్దుల వద్ద  14వేల మంది రైతులు 1200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 మినీ బస్సుల్లో మోహరించారు. వీరిని అడ్డుకునేందుకు ప్రభుత్వం వేలాదిమంది పోలీసులను రంగంలోకి దింపింది.

కేంద్ర మంత్రులతో రైతు నేతలు చర్చలు జరిపి, తమ ఆందోళనకు రెండు రోజులు విరామం ప్రకటించిన నేపథ్యంలో  రైతులు పంజాబ్- హర్యానా జాతీయ రహదారిపై శంభు, ఖానౌరీ సరిహద్దులవద్ద వేల సంఖ్యలో వేచి చూస్తున్నారు. చర్చలు విఫలమయ్యాయనీ, తమ ఆందోళన కొనసాగుతుందనీ సోమవారమే రైతు నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

తాము శాంతియుతంగా ఢిల్లీలోకి ప్రవేశించాలని భావిస్తున్నామనీ, తమను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి, తమకు అనుమతి ఇవ్వాలనీ రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ డల్లేవాల్ విజ్ఞప్తి చేశారు. కాగా రైతులకు బుల్ డోజర్లు, పొక్లెయినర్లను ఇవ్వకూడదనీ, అలా ఇచ్చినవారిపై క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News