Tuesday, January 21, 2025

సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సాగునీటి కోసం రైతన్నలు రోడ్డెక్కడం కాంగ్రెస్ నిర్లక్ష్య పాలనకు నిదర్శనం అని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాలోనే సాగు నీటికి కటకట ఏర్పడిందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రుల మాటలు కోటలు దాటితే.. ఆచరణ గడప దాటదంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది,రైతన్నకు క‘న్నీటి’ గోసను తెచ్చిందంటూ మండిపడ్డారు. పంట పొలాలకు నీళ్ల కోసం రోడ్లెక్కి ఆందోళన చేయాల్సిన దుస్థితిని కల్పించిందన్నారు. సాగు నీటి శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంత జిల్లా సూర్యపేటలోనే రైతుల పరిస్థితి ఇలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏమిటి..? అని ప్రశ్నించారు. యాసంగి సాగునీటి విడుదల షెడ్యూల్ పేరిట కోట్ల ప్రజాధనం వెచ్చించి ప్రకటనలు ఇచ్చారని మండిపడ్డారు.

ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ -2లో భాగంగా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ తదితర నియోజకవర్గాల్లోని 3,36,630 ఎకరాలకు సాగు నీటిని విడుదల చేస్తామని ప్రకటనల్లో పేర్కొన్నారన్నారు. ప్రచారం చేసుకున్నారు గానీ రైతన్నల పంట పొలాలకు నీళ్లు మాత్రం విడుదల చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.“మీ ప్రభుత్వ మాటలు నమ్మి నాట్లు వేసిన రైతుల పరిస్థితి ఏం కావాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అంటూ ప్రశ్నించారు. నాట్ల దశలోనే సాగు నీటికి గోస పడితే, మన్ముందు సాగు నీరు నీటి సరఫరా ఎలా చేస్తారని ప్రశ్నించారు. అద్భుతాలు చేస్తున్నట్లు భ్రమలు కల్పించడం మానేసి, ఇప్పటికైనా ఆచరణకు దిగాలని హితవు పలికారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలు, ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయడం మానేసి పంట పొలాలకు నీళ్లు అందించాలని.. ఆందోళనలో ఉన్న రైతన్నకు దన్నుగా నిలవాలని హరీష్ రావు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News