కొత్త అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
రైతులు చర్చలకు రావాలి : కేంద్ర మంత్రి తోమర్
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రైతు సంఘాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం నిరసన చేపట్టాయి. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నుంచి 200 మంది, కిసాన్ సంఘర్ష్ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో జంతర్‌మంతర్ చేరుకున్నారు.
కాగా,ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతుల నిరసన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు రైతుల నిరసనపై కేంద్ర మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి స్పందించారు. ఆందోళనలు నిలిపివేసి రైతులు ప్రభుత్వంతో చర్చలకు రావాలని కోరారు. దేశవ్యాప్తంగా రైతులు నూతన చట్టాలకు అనుకూలంగా ఉన్నారని, మద్దతు తెలుపుతున్నారని, కొన్ని చోట్ల మాత్రమే ఆపోహలతో నిరసనలు చేపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు.
Farmers protest in Jantar Mantar