అలహాబాద్: కేంద్రం తీసుకు వచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నేతృత్వంలో సాగుతున్న రైతుల ఆందోళన ఈ ఏడాది డిసెంబర్ దాకా కొనసాగుతుందని బికెయు జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ ఆదివారం ఇక్కడ చెప్పారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల పర్యటించి తిరిగి వచ్చిన తికాయత్ విలేఖరులతో మాట్లాడుతూ ఈ ప్రకటన చేశారు. ‘ఆందోళన బహుశా ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ దాకా కొనసాగవచ్చు’ అని ఆయన అన్నారు. ఇటీవలి తన బెంగాల్ పర్యటన గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నేతలు అక్కడ తమ ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఒక పండగ భోజనం ఇవ్వమని అడుగుతున్నారన్నారు.
అయితే ధాన్యం కొనుగోలుదారులకు ఒక్క గింజ ధాన్యం ఇచ్చే ముందు ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1850 కనీస మద్దతు ధర ఇవ్వాలని వారిని అడగాలని తాను బెంగాల్ ప్రజలకు సలహా ఇచ్చానని తికాయత్ చెప్పారు. బెంగాల్ తర్వాత తాను వివిధ పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయిస్తూ చట్టం చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో పర్యటించాలని అనుకొంటున్నట్లు ఆయన చెప్పారు.‘ బీహార్‌లో వ్యాపారులు ఇప్పుడు ధాన్యం క్వింటాల్ రూ.750 800 రేటుకు కారుచౌకగా కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల వివిధ పంటలకు కనీస మద్దతు ధర హామీనిస్తూ చట్టం చేయాలని నేను కోరుకుంటున్నాను’ అని ఆయన అన్నారు. తాను ఢిల్లీలోనే కూర్చోవాలని అనుకోవడం లేదని, దేశవ్యాప్తంగా పర్యటించాలని అనుకొంటున్నానని, ఈ నెల 14,15 తేదీల్లో మధ్యప్రదేశ్‌లో, 17న రాజస్థాన్‌లోని గంగానగర్‌లో, 18న ఘాజీపూర్‌లోని యుపి గేట్‌ను సందర్శిస్తానని తికాయత్ చెప్పారు.
కాగా ఆదివారం అలహాబాద్ పర్యటన సందర్భంగా రాకేశ్ తికాయత్ ఇక్కడికి సమీపంలోని తికాయత్ పార్కులో తన తండ్రి, దివంగత రైతు నాయకుడు మహేంద్ర సింగ్ తికాయత్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలతో నివాస ప్రాంతాల్లోని అన్ని చిన్న దుకాణాలు మూతపడిపోతాయని, కేవలం పెద్ద వాణిజ్య మాల్స్ మాత్రమే ఉంటాయని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం ఒక రాజకీయ పార్టీకి చెందినదైతే అది రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించి ఉండేదని ఆయన అంటూ, ‘అయితే ఈ ప్రభుత్వాన్ని భారీ వాణిజ్య సంస్థలు నడుపుతున్నాయి. అందుకే ఆది దేశాన్ని అమ్మేయాలన్న కృతనిశ్చయంతో ఉంది’ అని అన్నారు.
Farmers Protest may continue till Dec: Rakesh Tikait