Sunday, January 19, 2025

నీటిని విడుదల చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా

- Advertisement -
- Advertisement -

హాలియా: నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా నీటిని విడుదల చేసి ఎండిపోతున్న పంటలను కాపాడాలని మాజీ ఎంఎల్‌ఎ జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఎడమ కాల్వ సూరేపల్లి మేజర్ వద్ద జాతీయ రహదారిపై తెలంగాణ రైతు సంఘం అధ్వర్యంలో మేజర్ కింద గ్రామాల రైతులు రాస్తారోకో, ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, బోర్లను నమ్ముకొని ఎడమ కాల్వ కింద రైతులు 30 శాతం మంది వరి పంటలు వేశారని, నేడు అవి ఎండిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి ఎకారాకు 25 వేలు ఖర్చు పెట్టి ఉన్నారన్నారు. చెరువులు, బావులు, బోర్లు, కుంటలు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని తెలిపారు. తక్షణమే సాగర్ ఎడమ కాల్వ ద్వారా తాగు, సాగునీటి కోసం నీటిని విడుదల చేసి చెరువులు, కుంటలు నింపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.

రిజర్వాయర్‌లో నీటి నిల్వ లేదని సాకుతో నీటి విడుదలను ప్రభుత్వం అలసత్యం చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని, అనేకమంది అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే ప్రమాదం ఉందని తెలిపారు. గతంలో ప్రభుత్వాలు ప్రాజెక్టులో 505 టిఎంసిలు ఉన్నప్పుడు కూడా రైతు సంఘం ఒత్తిడితో రైతన్నకి సాగునీటిని అందించిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఎడమ కాల్వ కింద ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలలో అనేక మంది రైతులు ఎన్నో ఆశలతో రబీలో పంటలు సాగు చేస్తున్నారని తెలిపారు. వారబందీగానైనా ఒకసారి నీటిని విడుదల చేసి రైతన్ననను ఆదుకోవాలని సిఎం, భారీ నీటిపారుదల శాఖ మంత్రులను కలిసి వినతిపత్రం అందించామని అన్నారు. అయినా ప్రభుత్వంలో ఇప్పటికీ కదలిక లేదని, వెంటనే స్పందించి అధికారులు, స్థానిక ఎంఎల్‌ఎ ద్వారా సమస్యలను గుర్తించి పరిశీలించి నిర్ణయం తీసుకొని నీటి విడుదల చేసి రైతులను, మూగజీవాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను, కందుకూరి కోటేష్, కోమండ్ల గురవయ్య, నల్లబోతు సోమయ్య, మలికంటి చంద్రశేఖర్, కుంచెం శేఖర్, రైతులు రావుల ముసలయ్య, నర్సింహ, జానపాటి సైదయ్య, సింగడిశెట్టి నాగయ్య, కొండేటి సైదయ్య, రావుల ఆంజనేయులు, కొండేటి నాగయ్య, చారి, రవితేజ, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News