Sunday, January 19, 2025

ధాన్యం కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన రైతన్నలు

- Advertisement -
- Advertisement -

పండించిన పంటకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు బుధవారం వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండల పరిధిలోని గూడూరు గ్రామానికి చెందిన పలువురు రైతులు జాతీయ రహదారిపై బుధవారం ఆందోళనకు దిగారు. వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గల గూడూరు వద్ద రైతులు తమ ధాన్యాన్ని తీసుకుని వచ్చి రోడ్డుపై పోసి నిప్పంటించి ఆందోళనకు దిగారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన కొనసాగడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 15 రోజుల నుండి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని లేనియెడల పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా, మహ్మద్‌నగర్, కొమలంచ గ్రామాలలో బుధవారం రైతన్నలు ధర్నా చేపట్టారు.

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, రైస్‌మిల్లర్లు సైతం ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆందోళనకు దిగారు. మహ్మద్‌నగర్ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి నినాదాలు చేశారు. కొమలంచలో సైతం రైతన్నలు ఆందోళనకు దిగారు. రైస్‌మిల్లర్లు కోతలు విధిస్తున్నారని, దీంతో రైతులు నష్టపోతున్నారన్నారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ క్రాంతి కుమార్, సిఐ సత్యనారాయణ, ఎస్‌ఐ సుధాకర్ రైతులతో మాట్లాడారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ధర్నాను విరమించేది లేదని రైతన్నలు భీష్మించుకు కూర్చున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ..సకాలంలో లారీలను ఏర్పాటు చేస్తామని, కోతలు విధించకుండా చూస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. లారీలు రాక, కొనుగోలు చేయకపోవడంతో రాజన్న సిరిసిల్ల్ల జిల్లా, కోనరావుపేట మండలం, మల్కాపేట మల్కాపేటలో రోడ్డుపై తులు ధర్నా చేశారు. గత 20 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. అయితే, కొనుగోలు కేంద్ర నిర్వాహకులు సరియైన సమయంలో లారీలు రాకే కొనుగోలు చేయడం లేదని అంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News