Wednesday, January 22, 2025

ప్రధాని మోడీ సర్కారుపై సమరశంఖం

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా పోరాటాలకు పిలుపు
నవంబర్ 26న హైదరాబాద్ కేంద్రంగా మహాధర్నా
సంయుక్త కిసాన్ మోర్చా తెలంగాణ రాష్ట్ర సదస్సు

హైదరాబాద్ : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుపై జాతీయ కిసాన్‌మోర్చా సమరశంఖం పూరించింది. మోడీ ప్రభుత్వం ఢిల్లీలో రైతు ఉద్యమానికి ఇచ్చిన హామీలపై చేసిన మోసానికి నిరసనగా దేశ వ్యాప్తంగా రెండో దశ రైతాంగ పోరాటానికి కిసార్‌మోర్చా జాతీయ నాయకులు పిలుపు నిచ్చారు. ఆగస్టు నుండి నవంబరు వరకు రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలకు నిర్ణయించారు.శుక్రవారం హైదరాబాద్ లో సంయుక్త కిసాన్ మోర్చా సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విజయవంతంగా జరిగింది. రాష్ట్రం నలుమూలల నుండి 500 పైగా రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్ల కమిటీ అధ్యక్షతన జరిగిన సదస్సులో జాతీయ కమిటీ ప్రతినిధులుగా హన్నన్ మొల్లా, రావెల వెంకయ్య, రామిందర్ పాటియాలా, వడ్డే శోభనాద్రిశ్వరరావు, రాయల చంద్రశేఖర్, విస్సా కిరణ్ కుమార్, చిట్టిపాటి వేంకటేశ్వరరావు, గిరీష్, గాదగోని రవి, ప్రసాద్, నారాయణ రావు తదితరులు మాట్లాడారు.

2021డిసెంబర్ 9 న ప్రధాన మంత్రి మోడీ లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీల ఆధారంగా ఢిల్లీని ఘెరావ్ చేసిన రైతు ఉద్యమం తాత్కాలికంగా విరమించుకుంది. అయితే కనీస మద్దతు ధరల చట్టం, రైతు ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత వంటి హామీలను అమలు చేయక రైతులకు మోడీ ప్రభుత్వం చేసిన మోసాన్ని మళ్ళీ ప్రజలలోకి తీసుకు వెళుతూ దేశ వ్యాప్తంగా రెండో దశ రైతు ఉద్యమం ప్రారంభించాలని సంయుక్త కిసాన్ మోర్చా నిర్ణయించింది.

జాతీయ స్థాయి డిమాండ్లుగా – కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం, రైతుల రుణ విముక్తి, కార్పొరేట్ కంపెనీలకు కాకుండా రైతులకు లాభం కలిగించే పంట బీమా పథకం, రైతు ఉద్యమకారుల పై కేసుల ఎత్తివేత – అన్న డిమాండ్లతో దేశ వ్యాప్త ఉద్యమం బలపడుతున్నది. ఈ దేశ వ్యాప్త డిమాండ్లతో బాటు తెలంగాణ రైతులకు సంబంధించి ప్రత్యేక డిమాండ్లు పొందుపర్చారు. 2011 సాగుదారుల చట్టాన్ని అమలు చేసి కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు, ప్రభుత్వ పథకాల లబ్ధి అందించాలని, ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలోతీవ్రంగా పంట నష్టపోయిన రైతులకి నష్టపరిహారం అందించాలని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాలలో ఆదివాసీలకు హక్కు పత్రాలు ఇవ్వాలని, సమగ్ర భూ సర్వే జరిపి ధరణిలో లోపాలను సవరించాలని, రైతుల ఋణాలతో బాటు పేరుకుపోయిన వడ్డీని కూడా మాఫీ చేయాలని ప్రతిపాదించారు.

ఈ డిమాండ్లను సాధించుకోవడానికి దేశవ్యాప్తంగా రైతు ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో తెలంగాణ రాష్ట్ర రైతులు ముందు ఉండాలని జాతీయ నాయకులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీ ఆగస్టు నుండి నవంబరు వరకు వివిధ కార్యక్రమాలను ప్రకటించింది. ఆగస్టు 15 వ తేదీన స్వాతంత్య్రాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్న నినాదంతో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు నెలాఖరు లోగా అన్ని జిల్లాలలో జిల్లా కమిటీల ఏర్పాటు, జిల్లా సదస్సుల నిర్వహణ, సెప్టెంబర్, అక్టోబర్ నెలలలో అన్ని జిల్లాలలో పాద యాత్రలు, వాహన యాత్రలతో క్షేత్ర స్థాయి ప్రచార ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. నవంబరు 26, 27, 28 తేదీలలో వేలాది రైతులతో మూడు రోజుల పాటు హైదరాబాద్ లో మహా ధర్నా నిర్వహించాలని నిర్ణయించారు.2020-21 లో జరిగిన చారిత్రాత్మక ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాన్ని మళ్ళీ ఉధృతం చేసి తక్కిన డిమాండ్లను కూడా సాధించుకుంటామని, మోడీ ప్రభుత్వం రైతులకు, వ్యావసాయ కూలీలకు, ఆదివాసీలకు, శ్రామిక వర్గాలకు చేస్తున్న దగాని, కార్పొరేట్లకు దేశాన్ని కట్టబెట్టే విధానాలను రాష్ట్రం నలు మూలలా ప్రచారం చేస్తామని సదస్సు తీర్మానించింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ల కమిటిగా అధ్యక్షత వహించిన వివిధ రైతుసంఘాల,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకుల్లో టి.సాగర్, పశ్య పద్మ, వి.ప్రభాకర్, వెంకన్న, కన్నెగంటి రవి, మాడికాయల బిక్షపతి, వెంకటయ్య, మట్టయ్య, నాగిరెడ్డి, ప్రమీల ,బాలమల్లేష్ ,వెంకటరాములు, రామకృష్ణ, తుకారం తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News