Friday, November 22, 2024

పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలి: నిరంజన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే
తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్
తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలి
రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యపరుస్తున్నాం
శాసనమండలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి వెల్లడి

Minister Niranjan Reddy speech at Legislative Council

మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీలకతీతంగా ప్రజా ప్రతినిధులు, నేతలు పంటల మార్పిడికి రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండలిలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో దేశంలో తెలంగాణ వరి ఉత్పత్తి, విస్తీర్ణం స్థానం, సదరు ఉత్పత్తికి వినియోగించిన నీరు, వరిధాన్యం ఉత్పత్తి విలువపై సభ్యులు తేరా చిన్నపరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి నిరంజన్‌రెడ్డి సమాధానమిచ్చారు. తెలంగాణ విజయాలను దేశం గుర్తించిందన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీటి లభ్యత పెంచుకున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో తెలంగాణ రైతు తల ఎత్తుకుని తిరుగుతున్నాడన్నారు. సాగునీటి రాక, వ్యవసాయ పథకాలతో సాగు విస్తీర్ణం, పంటల ఉత్పత్తులు పెరిగాయని తెలిపారు.

ప్రతిపక్షాలు కొందరు నేతలు అవగాహన లేక ప్రాజెక్టులు, పంటల మీద విమర్శలు చేస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అనేక ప్రాజెక్టులు నిర్మించారని, వాటిని ఆధునిక దేవాలయాలు అన్నారని తెలిపారు. ఏ ప్రాజెక్టు కట్టినా సాగునీటి కల్పనతో పాటు భూగర్భ జలాలు, మత్స సంపద పెరుగుతాయన్నారు. ఆరుతడి పంటలకు కూడా సాగునీరు అవసరమని, ప్రాజెక్టు కడితే వరి పంట సాగుకే అనుకోవడం అది అవగాహనా రాహిత్యమే అవుతుందన్నారు. మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్‌తో మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను ప్రభుత్వం ప్రొత్సహిస్తుందన్నారు. కొందరు వరిధాన్యం ఎక్కువ ఎందుకు పండిస్తున్నారు? అని ప్రశ్నించడం ఆశ్చర్యకరంగా ఉందని తెలిపారు.

రాజస్థాన్‌లో వరి పండించగలరా? కేరళ, తమిళనాడులలో డిమాండ్‌కు తగ్గ వరి ధాన్యం దిగుబడి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ పండిన పంట దేశంలోని అనేక రాష్ట్రాలు, విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. దేశంలో ఆహార ధాన్యాలను సమతుల్యం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. తెలంగాణ రైతాంగానికి మేలు జరిగేలా సభలో సుదీర్ఘ చర్చ జరగాలని తెలిపారు. నూనె, పప్పు గింజల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. రైతు వేదికల ద్వారా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యపరుస్తున్నామని తెలిపారు. యాసంగిలో ఆరుతడి పంటలు సాగు చేయాలన్నారు. వెరుశనగ పెద్ద ఎత్తున సాగు చేయాలని చెబుతున్నామన్నారు. తెలంగాణలో పండే ఆఫ్లాటాక్సిన్ రహిత వేరుశనగకు అంతర్జాతీయ డిమాండ్ ఉందన్నారు.

గతేడాది 3.75 లక్షల ఎకరాల్లో ఉన్న సాగును ఈ ఏడాది ఐదు లక్షల ఎకరాలకు తీసుకుపోవాలని కృషి చేస్తున్నామని తెలిపారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసే అంశం మీద మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు. పంజాబ్‌లో వరిని కేంద్రమే కొనుగోలు చేస్తుందని, అదే విధంగా తెలంగాణ నుండి కొనుగోలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. పంజాబ్‌లో విస్తృతంగా వరి పండుతుంది, ఆ తర్వాత విస్తృతంగా వరిసాగయ్యేది తెలంగాణలోనేనని అన్నారు. అందుకే పంజాబ్ మాదిరిగా పూర్తిస్థాయిలో ఇక్కడా కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నామని తెలిపారు. నియంత్రిత సాగు మీద కొందరు బురద జల్లి అక్కసు వెళ్లగ్రక్కారన్నారు. యాసంగిలో వరి తగ్గించి ఇతర పంటలు వేయాలని చెబుతున్నామని తెలిపారు. తప్పనిసరి పరిస్థితులు ఉన్న చోటనే వరిని సాగు చేయమని చెబుతున్నామన్నారు. యాసంగిలో 30 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే వరిధాన్యంలో నూక శాతం పెరుగుతుందని, అందుకే యాసంగిలో ఒక నెల ముందు అంటే మార్చి 10 లోపు పంట కోతకు వచ్చేలా చూసుకోవాల్సి ఉందని తెలిపారు.

వరి ఉత్పత్తిలో…
202021 యాసంగి కాలంలో వరి ఉత్పత్తిలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది
2020 వానాకాలంలో నాలుగో స్థానంలో నిలిచింది.
2020 వానాకాలంలో వరి ఉత్పత్తి 96.31 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, యాసంగిలో 122.16 లక్షల మెట్రిక్ టన్నులు
వరికింద సాగు చేసిన విస్తీర్ణం ః
202021లో 1,04,073 ఎకరాలు
వానాకాలంలో 52,51,000 ఎకరాలు
యాసంగిలో 52,22,000 ఎకరాలు
వినియోగించిన నీటి పరిమాణము 1834.25 టిఎంసీలు
ఉత్పత్తి విలువ ః
వరి ధాన్య ఉత్పత్తి విలువ ః 4,124 కోట్లు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News