నల్లగొండ: కష్టం చేసిన రైతులే పంటలకు ధర నిర్ణయించుకోవాలనే ఉద్దేశంతో రైతుబంధు, రైతువేదికలు ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో రైతు వేదికలను, భూ సార పరీక్ష కేంద్రాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రైతు సభలో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్ లో దేశానికి దారి చూపుతుందని, రైతాంగం హక్కుల కోసమే రైతు వేదికలు, వాళ్లను సంఘటితం చేసేందుకే వేదికలను నిర్మిస్తున్నామన్నారు.
వివిధ రకాల ఉద్యోగులు, వివిధ సంఘాలకు వేదికలు ఉన్నట్లే రైతులు సంఘటితంగా ఉండేందుకు ఓ వేదిక ఉండాలని ముఖ్యమంత్రి కెసిఆర్ రైతు వేదికలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రంలో రైతు వేదికలు లేవని, మొదలు పెట్టినప్పుడు రైతుబంధు కొనసాగదని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయని గుర్తు చేశారు. ఎన్నికల కోసమే ఈ పథకం అని ఎన్నికల తర్వాత ఉండదని ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. కానీ ఇప్పటివరకు ఏడు విడతలలో రూ.44 వేల కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి జమ చేశామని కెసిఆర్ పేర్కొన్నారు. దేశంలో, ప్రపంచంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పథకాన్ని చేపట్టలేదని, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతు కుటుంబాలకు భరోసా ఉండాలని రైతుభీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ పొగిడారు.
ఇప్పటి వరకు రైతు భీమా కింద రూ. 2917.39 కోట్ల ప్రీమియం ఎల్ఐసికి చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు 57,599 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.2879.96 కోట్ల భీమా సొమ్ము జమ చేశామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రూ.50 వేల వరకు రుణాలున్న 6,06,811 మంది రైతుల రూ.2005.85 కోట్ల రుణమాఫీ కెసిఆర్ ప్రభుత్వం చేసిందని, రైతు వేదికలలో రైతులకు నిరంతర శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటల సాగుకు రైతులను చైతన్యం చేయాలని, దేశానికి అన్నం పెట్టిన పంజాబ్ తో పోటీ పడి కెసిఆర్ పాలనలో ఏడాదిలో 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి చేసిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టిస్తోందన్నారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో ఎలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు.
తెలంగాణలో 2.40 కోట్ల జనాభాకు ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఉపాధినిస్తున్న రంగం వ్యవసాయరంగమని, గతంలో ఉపాధి లేక పాలమూరు బిడ్డలు మిర్యాలగూడ ప్రాంతానికి వలసవచ్చారని, ఇప్పుడు ఉన్న ఊరు నుండి ఎవరూ వసల వెళ్లే దుస్థితి తెలంగాణలో లేదని, దేశంలో కనీస మద్దతుధరకు పంటలు కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ప్రశంసించారు. బిజెపి పాలిత 20 రాష్ట్రాలలో తెలంగాణ మాదిరిగా పథకాలు ఎందుకు లేవు అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్ లో ఇప్పటికీ రైతులు ఆయిల్ ఇంజన్లే ఉపయోగిస్తున్నారని, వ్యవసాయానికి కరెంటు వినియోగించుకోలేని దుస్థితి యుపి రైతాంగానిదని, బిజెపివి అన్ని వట్టి మాటలేనని, చేతలు ఉండవని, ఇప్పటికీ యుపిలో 35 లక్షల ఆయిల్ ఇంజన్లు నడుస్తున్నాయన్నారు. రైతులందరూ సంతోషంగా ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.