మూడోరోజూ ఢిల్లీచలో ఉద్రిక్తత
చండీగఢ్ : తమ డిమాండ్ల సాధనకు రైతులు ఓ వైపు కేంద్ర మంత్రుల బృందంతో చర్చలు జరుపుతూనే మరో వైపు తమ ఢిల్లీచలోను పట్టువీడకుండా సాగిస్తున్నారు. దీనితో వరుసగా మూడోరోజు కూడా పంజాబ్ , హర్యానా సరిహద్దులు, ఢిల్లీ శివార్లలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకూ రెండు దఫాలుగా సాగిన చర్చలు పురోగతి సాధించలేదు.
దీనితో పంజాబ్, హర్యానా మధ్య సరిహద్దు ప్రాంతాలైన శంభూ, కనౌరి వద్ద రైతులకు, పోలీసు, పారామిలిటరీ బలగాల నడుమ ప్రతిష్టంభన నెలకొంది. పంజాబ్‌లో రైతుల ఉద్యమం మరో మలుపు తిరిగింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు సంఘాలు, ఇతర సంస్థల పిలుపుతో రైలురోకో కార్యక్రమం సాగింది. చర్చల ఫలితం తేలేదాకా ఢిల్లీ వైపు సాగకుండా సరిహద్దులలో ఉంటామని రైతుల ఉద్యమనిర్వాహకులు తెలిపారు. అయితే భారతీకిసాన్ యూనియన్ , బికెయు దకౌండ ఆధ్వర్యంలో రైలురోకో సాగింది. కొన్నిచోట్ల రైతులు రైలు పట్టాలపై పడుకుని రైళ్లు నిలిపివేశారు.