Saturday, November 23, 2024

‘సాగు’బాట

- Advertisement -
- Advertisement -

Farmers start works with Mrigasira Karthi enter

మిరుగుతో వ్యవసాయ పనులకు శుభారంభం
ఊరిస్తున్న రుతుపవనాలు, జోరుగా విత్తనాల కోనుగోళ్లు

మనతెలంగాణ/హైదరాబాద్: మృగశిర కార్తె రాకతో ముంగిళ్లు చల్లబడ్డాయి. ముసలెద్దు సైతం లేచి రంకెలేస్తోంది. మిరుగు ప్రవేశంతో రాష్ట్రమంతటా రైతులు వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. మృగశిర కార్తె ప్రవేశాన్ని మిరుగుగా పిలుచుకునే రైతులు ఈ కార్తెలోనే పొలంలో విత్తనాలు వేసేందుకు మొగ్గుచూపుతుంటారు. వానాకాలం పంటల సాగు ప్రారంభానికి ఈ కార్తె ఎంతో అనుకూలంగా ఉంటుందని రైతుల నమ్మకం. వాతావరణ పరిస్థితులు కూడా రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా పంటల సాగుకు అనుకూలిస్తుంటాయి. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో మృగశిర ప్రవేశంతో రైతులు పొలం పనులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే పొలాల్లో వేసవి దుక్కులు దున్ని సేద్యం పనులు పూర్తి చేసుకున్న రైతులు చాలా జిల్లాల్లో పత్తి విత్తనాలు నాటుకునే పనులు చేపట్టారు. మృగశిరలో విత్తనం నాటితే ముంగారు పంట పండుతుందని రైతుల విశ్వాసం. గత నెల 22న ప్రారంభమైన రోహిణి కార్తే ఈ సారి కాస్త కూల్‌గానే వెళ్లిపోయింది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయంటుంటారు. అయితే ఆ స్థాయి ఉష్ణోగ్రతలకు అవకాశం లేకుండానే మంగళవారం నాటితో రోహిణి కార్తే ముగిసి పోయి మృగశిర కార్తే ప్రారంభమయింది.

ఈ నెల 22తో మృగశిర ముగిసి పోయి 22న ఆరుద్ర కార్తె ప్రవేశించనుంది. మృగశిరలో కురిసే వర్షాలు ఎంతో బలమైనవని, ఈ సమయంలో చేలో విత్తనం పడితే ఇక సమృద్ధిగా పంటదిగుబడి లభిస్తుందని రైతుల నమ్మకం. ఈ కార్తెలోనే దేశవాళీ ముంగారి పత్తి విత్తన రకాలు సాగులో వుండేవి. అయితే అధిక దిగుబడులు అందించే హైబ్రిడ్ పత్తి వంగడాల రాకతో దేశవాళీ ముంగారి పత్తిరకాలకు రైతులు స్వస్తి చెప్పి సంకర రకాలను పెద్ద ఎత్తున ఆదరించారు. ఈ సారి ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పత్తిసాగును ప్రోత్సహిస్తోంది. వరికి ప్రత్యామ్నాయ పంటగా పత్తిని ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఈ సారి 75లక్షల ఎకరాల్లో పత్తి సాగు విస్తీర్ణం లక్షంగా పెట్టుకుంది. ఉత్తర తెలంగాణలోని అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో రైతులు పత్తి విత్తనాలు నాటే పనులకు శ్రీకారం చుట్టారు. దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాల్లో కూడా పలు చోట్ల పత్తి విత్తనం నాటే పనులు మందకోడిగా చేపట్టారని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 22నాటికి మృగశిర కార్తె ముగిలోపే అధికశాతం విస్తీర్ణంలో పత్తిసాగులోకి వస్తుందని ఆంచనా వేస్తున్నారు. వర్షాధారంగానే కాకుండా ఆరుతడి కింద కూడా పత్తికి ఈ సారి రైతులు అధికంగా మొగ్గు చూపుతున్నారు. వర్షాధారంగా విత్తనం వేసినప్పటికీ వాతావరణ పరిస్థితులను బట్టి నీటి తడులు అందించేందుకు వీలుగా పాలాన్ని సిద్దం చేసుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ పద్ధతిని ప్రోత్సహిస్తోంది. రెండు మూడు తడుల నీటిని అందిస్తే దిగుబడులు కూడా ఆశించిన రీతిలో ఉంటాయని వ్యవసాయ అధికారులు రైతులకు వివరిస్తూ ఆరుతడి సాగుపద్ధతులపై అవగాహణ పెంచుతున్నారు.

Farmers start works with Mrigasira Karthi enter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News