Sunday, September 8, 2024

జోరుగా ఏరువాక

- Advertisement -
- Advertisement -

నైరుతి రాకతో రైతుల్లో ఉత్సాహం, ఉరకలు
త్వరలో రైతుబంధుకు ప్రభుత్వం ఏర్పాటు
ఈ ఏడాది రూ.14,800కోట్లు కేటాయింపు

మనతెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రమంతటా ఏరువాక పౌర్ణమి మంచిజోరుమీద సాగింది. మంగళవారం నాడు రైతులు వ్యవసాయపనులకు శ్రీకారం చుట్టి ఏరువాక పౌర్ణమికి స్వాగతం పలికారు. ఎడ్లను అందంగా ముస్తాబు చేశారు. గొర్రు , నాగలి తదితర వ్యవసాయ పనిముట్లకు పూజలు చేశారు. ఏరువాక పౌర్ణమికి నైరుతి రుతుపవనాలు కూడా కలిసి రావటంతో రైతులు మరింత ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదను కాలానికి పదును వానలు జతకావటంతో తొలకరి దుక్కుల్లో రైతులు బిజిగా మారుతున్నారు. వ్యవసాయ రంగం పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతున్న టీఆర్‌ఎస్ సర్కారు ఈ ఏడాది వ్యవసాయ రంగానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. వ్యవసాయంతోపాటు పశుసంవర్ధకం, పాడి పరిశ్రమ , తదితర అనుబంధ రంగాలకు కలిపి రూ.29,922కోట్లు కేటాయించింది. అందులో ప్రత్యేకించి వ్యవసాయరంగానికే రూ. 24,254కోట్లు కేటాయించింది.

ప్రభుత్వం ఆర్ధికంగా ఎన్ని కష్టాల్లో ఉన్నా, రైతుసంక్షేమ పథకాలకు నిధుల విడుదలలో అత్యధిక ప్రాధాన్యత నిస్తోంది. వ్యవసాయ పనులు ప్రారంభం కావటంతో రైతుబంధు పథకం నిధుల కోసం సన్న, చిన్నకారు రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది వానాకాలం సీజన్‌కు జూన్ మొదటి వారంలోనే ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేసింది. ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌లో ఈ పధకానికి ప్రభుత్వం రూ.14,800కోట్లు కేటాయించింది. త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతుబంధు పధకం ద్వారా రాష్ట్రంలో 63లక్షల మంది రైతులకు లబ్ధిచేకూరుతోంది. ఈ పథకం ప్రారంభించాక ఇప్పటివరకూ ఎనిమిది విడుతల్లో రూ.50,448కోట్లను ముఖ్యమంత్రి కేసిఆర్ రైతుల ఖాతాల్లో నేరుగా జమచేయించారు. ఈ సారి రైతుబంధు పథకానికి కొత్తరైతులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు. దీంతో లబ్దిదారుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

రైతుబంధుతోపాటుగా రైతుబీమా పధకానికి కూడా ప్రభుత్వం నిధులు అందజేసేందుకు సిద్దంగా ఉన్నట్టు సమాచారం. రైతుబీమా పథకం కింద ఈ ఏడాది బడ్జెట్‌లో రూ1466కోట్లు కేటాయించింది. గత ఏడాది కంటే ఈ ఏడాది ఈ పథకానికి రూ.265కోట్లు అధికంగా కేటాయించింది. రైతులు ఏ కారణం చేత మృతి చెందినా ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం నేరుగా ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షలు ఆర్ధికసాయం అందజేస్తోంది. ఇప్పటివరకూ ఈ పధకం కింద ప్రభుత్వం 3775కోట్ల రూపాయలు రైతు కుటుంబాలకు అందజేసి వారికి అండగానిలిచింది. పంటలు పండక , రుణాల ఊబిలో చిక్కుకుపోయిన వారికి ఉపశమనం కలిగించేందుకు కేసీఆర్ సర్కారు రైతు రుణమాఫీ పధకాన్ని విజయవంతంగా అమలు చేస్తోంది. ఈ ఏడాది రూ.75వేలలోపు రుణం ఉన్న రైతులందరికీ మాఫీని అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.2939కోట్ల రూపాయలును కేటాయించింది.

వరిసాగుకు ప్రత్యామ్నాయ పంటలు:

వరిసాగు గిట్టుబాటు కాకపోవటంతో రైతులను ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. వరికి బదులు ఇతర పప్పుధాన్యాలు , నూనెగింజపంటలను ప్రోత్సహిస్తోంది. వాణిజ్య పంటల్లో ఈ సారి పత్తి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. పతికి కూడా మంచి లాభసాటి ధరలు లభిస్తుండటంతో రైతులు కూడా పత్తిసాగు పట్ల మొగ్గుచూపుతున్నారు. రాష్ట్రంలో 75లక్షల ఎకరాల మేరకు పత్తిసాగయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కంది సాగును కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. నూనెగింజ పంటల సాగులో దీర్గకాలికంగా లాభాలు అందించే ఆయిల్ పామ్‌సాగును ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.1000కోట్లు ఖర్చు చేయనుంది.

ఎరువులు విత్తనాలు సిద్దం:

వానాకాలం పంటల సాగు అదను ప్రారంభం కావటంతో ప్రభుత్వం విత్తనాలు , ఎరువులు సమృద్దిగా రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. అత్యధికంగా సాగులోకి వచ్చే పత్తిసాగుకోసం కోటి70లక్షల పత్తివిత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచింది. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రీయ ఎరువుల ద్వారా భూసారాన్ని పెంచేందుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఇందుకోసం జీలుగ,జనుము , పిల్లిపెసర తదితర పచ్చిరొట్టె ఎరువుల విత్తనాలను రాయితీధరలపై రైతులకు అందజేస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News