స్తంభించిన ప్రజా జీవితం
చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన గ్యారంటీతోపాటు అనేక డిమాండ్ల సాధనకు కేంద్రానికి వ్యతిరేకంగా పంజాబ్‌లో సోమవారం తొమ్మిది గంటల పాటు నిర్వహించిన బంద్‌తో ప్రజా జీవితం స్తంభించిపోయింది. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బంద్‌కు పిలుపు ఇచ్చాయి. 35 రోజులుగా నిరాహార దీక్ష సాగిస్తున్న రైతు నేత 70 ఏళ్ల జగ్‌జిత్‌సింగ్ దల్లేవాల్‌కు మద్దతుగా కూడా ఈ బంద్ పాటించడంతో రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.
ఫిరోజ్‌పూర్, జలంధర్, లూథియానా, బాతిండా స్టేషన్లలో ప్రయాణికులు పడిగాపులు కాయడం కనిపించింది. షాపులు, ఇతర సంస్థలు మూతపడ్డాయి. ఒకవైపు ఎముకలు కొరికే చలి, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కమ్ముకున్నా రైతులు లెక్కచేయక పాటియాలా, జలంధర్, అమృత్‌సర్, ఫిరోజ్‌పూర్, బాతిండా, పఠాన్‌కోట్ రోడ్లపైన, జాతీయ రహదార్లపైన ధర్నాలు కొనసాగించారు. ఫగ్వారాలో జాతీయ రహదారి సమీపాన ఉన్న చక్కెర మిల్లు వద్ద రైతులు ధర్నా సాగించడంతో ఫగ్వారా నుంచి నకోదర్, హోషియార్‌పూర్, నవాన్‌షహర్ నుంచి వెళ్లే రోడ్లన్నీ స్తంభించాయి. ఫగ్వారా బంగా రోడ్డుపైని బెహ్రాం టోల్‌ప్లాజా వద్ద రైతులు ధర్నా సాగించారు.
పబ్లిక్ రవాణాతోపాటు ప్రైవేట్ బస్సులు కూడా ఆగిపోయాయి. సుదూరం వెళ్లాల్సిన ప్రైవేట్ బస్సులు , కూరగాయలు, పండ్లు తీసుకెళ్లాల్సిన ట్రక్కులు కదలలేదు. లూథియానా జిల్లాలో చౌరాబజార్, సబన్ బజార్, విశ్వకర్మ చౌక్, గిల్‌రోడ్, సరభ నగర్, ప్రాంతాల్లో కొన్ని షాపులే తెరిచారు. బాతిండా జిల్లా నుంచి అమృత్‌సర్, శ్రీగంగాథర్, ముక్తసర్ వెళ్లే రోడ్లన్నీ ఆందోళనలతో బంద్ అయ్యాయి. అమృత్‌సర్ గోల్డెన్ గేట్ వద్ద రైతుల ధర్నాతో చిక్కుకుపోయిన విదేశీ పర్యాటకులకు పోలీస్‌లు సహకరించి స్వర్ణదేవాలయానికి వారిని ఆటోల్లో పంపించారు. బంద్ ముగిసిన తరువాత రైతునాయకుడు జగ్‌జిత్ సింగ్ దల్లేవాల్ తమ బంద్ విజయవంతం చేసిన మూడు కోట్ల పంజాబ్ ప్రజలకు వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. తమ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కోరారు. మరోరైతు నాయకుడు సర్వణ్ సింగ్ పాంథేర్ అమృత్‌సర్‌లో విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర సేవలను, ముఖ్యమైన అవసరమైన సేవలను తాము అనుమతించామని చెప్పారు. ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నవారిని, లేదా జాబ్ ఇంటర్వూకు వెళ్తున్నా, పెళ్లికి వెళ్తున్నా వారెవరినీ అడ్డుకోలేదని చెప్పారు.