Sunday, December 22, 2024

తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాగా తగ్గాయి

- Advertisement -
- Advertisement -

Farmers’ suicides in Telangana decline

2014తో పోల్చితే 2020 నాటికి సగానికి పైగా పడిపోయిన అన్నదాతల ఆత్మహత్యలు: లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి తోమర్ వెల్లడి

n 2014లో898 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా,2020లో446కు దిగిన సంఖ్య
n 2015లో 1358మంది , 2016లో 632 ,2017లో 846 , 2018లో 900 మంది రైతుల ఆత్మహత్యలు
n తగ్గిన ఈ అంకెల్లో ప్రతిబింబిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయరంగంలో చేస్తున్న కృషి
n భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో ఇరిగేషన్ రంగంలో వినూత్న విప్లవం
n ఉచిత నాణ్యమైన విద్యుత్ సరఫరాతో రైతుల్లో సాగుపై పెరిగిన ఆసక్తి
n మిషన్ కాకతీయతో పెరిగిన చెరువుల నిల్వ సామర్థం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నాడు లోక్‌సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ సభ్యులు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అనూహ్యరీతిలో రైతుల ఆత్మహత్యలు తగ్గినట్టు తోమర్ తెలిపారు. 2014నుంచి 2020నాటికి సగానికి పైగా అన్నదాతల ఆత్మహత్యలు తగ్గినట్టు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో 2014లో 898మంది రై తులు ఆత్మహత్యలకు పాల్పడి మృతి చెందగా ,2020లో 446మంది రై తులు ఆత్మహత్య చేసుకున్నట్టు వెల్లడించారు. మిగిలిన సంవత్సరాల్లో కూ డా ఆత్మహత్యల సంఖ్య తగ్గుతూనే వచ్చినట్టు తెలిపారు. 2015లో 135 8మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, 2016లో 632మంది, 2017లో 846మంది, 2018లో 900మంది రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్టు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్ లోక్ సభలో వెల్లడించారు.

వ్యవసాయ అనుకూల విధానాలే రైతుకు రక్షణ:

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ ప్రాంతంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై టీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులకు పెద్ద ఎత్తున ఆత్మవిశ్వాసం పెంపొందించగలిగారు. వ్యవసాయంలో పంటల సాగుకు సంబంధించి ఇదివరకు ఉన్న విద్యుత్ కోతలు పూర్తిగా ఎత్తివేశారు. పంటలసాగును ప్రోత్సహిస్తూ వ్యవసాయమోటార్లకు 24గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరాను ప్రారంభించారు. రైతులు పంటల సాగుకోసం పెట్టుబడిగా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించి రైతుల్లో మరింత ధైర్యం పెంపొందించారు. దశలవారీగా పంటరుణాలను మాఫీ చేస్తూ బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలను ప్రభుత్వమే చెల్లిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంటసాగు ఖర్చులు భారంగా మారకుండా రైతుబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చారు. ఎకరానికి రూ.10వేల చొప్పున వానాకాలంలో రూ.5వేలు, యాసంగిలో రూ.5వేలు పంటసాగు సీజన్ ప్రారంభదశలోనే నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు.

రైతుబంధు పధకం అమలు కోసం ఏటా 12వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 64లక్షల మందికిపైగా రైతులకు లబ్దిచేకూరుతోంది. ఈ పథకం రాష్ట్రంలోని 80శాతం సన్నచిన్నకారు రైతులకు పెద్ద వరంగా మారింది. పంట ఏదైనప్పటికీ ఏటా రూ.10వేలు పెట్టుబడి సాయం రైతులకు పెద్ద ఊరట కల్పిస్తోంది. అంతే కాకుండా రైతుబీమా పథకం రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాలకు కొండంత అండగా నిలిచింది. రైతులు ఏ కారణం చేత మృతి చెందినా , ఆ రైతు కుంటుబం ఇంటికి పెద్దదిక్కును కోల్పోయి మరింత కుంగిపోకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మృతి చెందిన రైతు కుటుంబానికి పదిరోజుల్లోపే రూ.5లక్షలు ప్రభుత్వం అందజేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం వార్షిక బీమా ప్రీమియం కింద రైతుల పక్షాన ఒక్కో రైతుకు రూ.2271 చెల్లిస్తోంది, ఇందుకోసం ప్రభుత్వం ఏటా మొత్తం రూ.1200 కోట్లు చెల్లిస్తోంది.

ప్రాజెక్టులతో పెరిగిన ధైర్యం

రాష్ట్రంలో కృష్ణా, గోదావరి నదీజలాల ఆధారంగా కేసిఆర్ సర్కారు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వ్యవసాయ రంగం రూపురేఖలనే మార్చివేస్తోంది. మిషన్‌భగీరధ, మిషన్ కాకతీయ పథకాలు తెలంగాణ రైతాంగంలో మరింత ధైర్యాన్ని నింపుతున్నాయి. చెరువుల్లో పూడిక తొలగించి వాటి నీటి నిలువ సామర్దం పెంచటం ,పీడర్ చానళ్ల ద్వారా నదీజాలలతో చెరువులను నింపటం వల్ల మండు వేసవిలో సైతం చెరువులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ రా్రష్ట్రాన్ని సశ్యశ్యామలంగా మార్చివేసింది.

అనుబంధ రంగాలతో పెరిగిన ఉపాధి:

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంతోపాటు పాడి పరిశ్రమ, గొర్రెలు మేకల పెంపకం, కోళ్లపెంపకం తదితర వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తుండంటం వల్ల వ్యవసాయ కుటుంబాల్లో ఉపాధి అవకాశాలు మరింతగా పెరిగాయి. పంటల సాగుతోపాటు అనుబంధ వృత్తుల ద్వారా రైతుకుటుంబాలు అదనపు రాబడిని పొందగలుగుతున్నాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదరైతు కుటుంబాల్లో సైతం జీవన ప్రమాణాలను పెంచి బతకుపై భరోసా కల్పిస్తున్నాయి. ఈ చర్యలన్ని తెలంగాణ రాష్ట్రంలో రైతుల అత్మహత్యలను నిలువరించగలుగుతున్నాయని ఇటీవల నీతిఅయోగ్ కూడా తన నివేదికల్లో స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News