మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతాంగం మళ్లీ ఉద్యమించింది. ఈ నెల 16న గ్రామీణ భారత్ బంద్ కు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. బీకేయూ ప్రధాన కార్యదర్శి హరీందర్ సింగ్ లోఖోవాల్ గ్రామీణ భారత్ బంద్‌కు సంబంధించిన వ్యూహాన్ని వెల్లడించారు. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కి హామీ ఇచ్చే చట్టంతో సహా తమ డిమాండ్లను ఆమోదించాలని కేంద్రాన్ని ఒత్తిడి చేసేందుకు సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నిరసనకు పిలుపునిచ్చాయి.ఎస్‌కేఎం నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ (ఎన్‌సిసి) సభ్యుడు డాక్టర్ దర్శన్ పాల్ మాట్లాడుతూ డిసెంబర్‌లోనే గ్రామీణ భారత్ బంద్‌కు ప్లాన్ చేసినట్లు తెలిపారు.
వ్యవసాయ పనులు, ఉపాధిహామీ పనులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ కార్మికులెవరూ పని చేయరన్నారు. అంబులెన్స్‌లు, వివాహాలు, చావులు, మెడికల్ షాపులు, వార్తాపత్రికల సరఫరా, బోర్డు పరీక్షలకు వెళ్లే విద్యార్థులు, విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల అత్యవసర సేవలకు మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. కూరగాయలు, ఇతర పంటల క్రయవిక్రయాలు, కొనుగోళ్లు నిలిచిపోతాయన్నారు. 2020లో చేపట్టిన ఆందోళనల వల్ల కేంద్రం దిగిరావటంతో అప్పట్లో రైతు సంఘాలు ఉద్యమాన్ని విరమించాయి. అయితే కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవటంతో రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు చట్టాలను విరమించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యమం సందర్భంగా రైతులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని భారతీయ కిసాన్ యూనియన్ అధినేత రాకేశ్ టికాయత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.