సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ నెల 18 నుండి నాలుగు రోజుల పాటు వీచిన ఈదురుగాలులు, వడగళ్ళ వానకు నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, నిర్మల్ తదితర జిల్లాల్లో 20వేల ఎకరాలకు పైగా మిరప, పత్తి, మొక్కజొన్న, వరి, జొన్న, పొగాకు, శనగ, మామిడి పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆవేదన వ్యక్తం చేశారు. కోత కోసిన పంటలేకాక, మార్కెట్‌కు వచ్చిన ధాన్యం కూడా తడిసి ముద్దయిందన్నారు.
తక్షణమే గణాంకాలను సేకరించి, నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.20వేల పరిహారం చెల్లించాలని, రుణమాఫీని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏడాదిలోనే మూడు సార్లు కురిసిన అకాల వర్షాల వల్ల ఇప్పటికే రైతులు తీవ్రంగా నష్టపోయారని, వానాకాలంలో 12 లక్షల ఎకరాల్లో, యాసంగిలో మిఛౌంగ్ తుఫాన్ వల్ల 4.70 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. దీంతో అప్పటి ముఖ్యమంత్రి నష్టపోయిన రైతులకు ఎకరాకు రు.10వేల నష్టపరిహారమిస్తామని ప్రకటించి, కనీసం గణాంకాలు కూడా సేకరించలేదని, తుఫాన్ వల్ల మరణించిన 49 మంది కుటుంబాలకు కూడా పరిహారమివ్వలేదని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వ మైనా పంట నష్టాలను సేకరించి రైతులను ఆదుకోవాలని తమ్మినేని కోరారు.