ఫరూక్ ఇంజినీర్
ముంబై: బ్యాటింగ్‌లో వరుస వైఫల్యాలు చవిచూస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి భారత మాజీ దిగ్గజం ఫరూక్ ఇంజినీర్ అండగా నిలిచాడు. ఏ క్రికెటర్‌కైనా ఆటలో ఇలాంటి ఎత్తుపల్లాలు సహాజమేనని పేర్కొన్నాడు. కోహ్లి కూడా మనలాంటి మనిషే అని..మానవులు ఎవరైనా తప్పులు చేయడం సహాజమేనని ఫరూక్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం బ్యాటింగ్‌లో వైఫల్యం చవిచూస్తున్న మళ్లీ గాడిలో పడే సత్తా కోహ్లికి ఉందన్నాడు. అతను మళ్లీ వరుస సెంచరీలతో చెలరేగి పోవడం ఖాయమన్నాడు. కోహ్లిలాంటి ప్రతిభావంతుడ్ని ఎక్కువ రోజులు సెంచరీలు చేయకుండా ఆపడం బౌలర్లకు అంత తేలికకాదన్నాడు. త్వరలోనే కోహ్లి ఫామ్‌లోకి వచ్చి పరుగుల వరద పారించడం ఖాయమని జోస్యం చెప్పాడు.
ఇక కోహ్లిలాంటి సత్తా ఉన్న క్రికెటర్ బరిలోకి దిగిన ప్రతిసారి శతకం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విరాట్ కూడా ఓ మనిషేనని, ఎవరికైనా ప్రతిసారి సెంచరీలు కొట్టడం సాధ్యమయ్యే పనికాదన్నాడు. ఇక కోహ్లి సెంచరీలు సాధించక పోవడానికి పేలవమైన బ్యాటింగ్‌తో పాటు అదృష్టం కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నాడు. కీలక సమయంలో అతను వికెట్‌ను పారేసుకుని పెవిలియన్ చేరుతున్న విషయాన్ని గుర్తు చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో జరిగే మిగతా మూడు టెస్టుల్లో కోహ్లి మెరుగైన బ్యాటింగ్‌ను కనబరచడం ఖాయమని ఫరూక్ పేర్కొన్నాడు.