న్యూఢిల్లీ : ప్రజల్లో తమపై మరింత ద్వేషం నింపేందుకే ద కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. మంగళవారం ఆయన ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ ద కశ్మీర్ ఫైల్స్ చిత్రం పైన, బీజేపీ పైన విమర్శలు గుప్పించారు. ఒక దురుద్దేశం తోనే ఈ చిత్రాన్ని రూపొందించారని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కావాలనే ద కశ్మీర్ ఫైల్స్ చిత్రానికి రాయితీలు ప్రకటిస్తూ, ప్రచారం కల్పిస్తున్నాయి. ప్రజలతోపాటు సైనికులు, పోలీసులు తప్పనిసరిగా ఈ చిత్రాన్ని చూడాలని చెబుతున్నాయి. దీని ద్వారా ప్రజల్లో మాపై మరింత ద్వేషం పెంచాలనుకుంటున్నాయి. 1990 నాటి సంఘటనల్లో హిందువులు, ముస్లింలు అందరూ ఇబ్బంది పడ్డారు. దీని గురించి తలచుకుంటే ఇప్పటికీ నాగుండె బరువెక్కుతుంది. ఈ ఘటనల వెనుక రాజకీయ పార్టీల దురుద్దేశాలున్నాయి. అప్పట్లో జర్మనీలో హిట్లర్, గోబెల్స్ పెంచుకున్న ద్వేషం వల్ల లక్షల మంది యూదులు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ఇంకెంతమందికి ఆ పరిస్థితి వస్తుందో అని ఫరూక్ వ్యాఖ్యానించారు. 1990 లో కశ్మీర్ పండిట్లపైనే కాకుండా ముస్లింలు, సిక్కులకు కూడా ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఒక నిజ నిర్ధారణ కమిషన్ వేయాలని ప్రభుత్వానికి సూచించారు. నాటి ఘటనకు తాను బాధ్యుడినని రుజువైతే ప్రాణత్యాగానికైనా సిద్ధమేనన్నారు. కశ్మీర్ పండిట్‌లకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనప్పటికీ తాను ఎలాంటి చర్యలు తీసుకోలేదని వస్తోన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. కశ్మీర్ పండిట్‌లు భారీగా వలస వెళ్లే సమయంలో నాటి గవర్నర్ రే వారిని బస్సుల్లో ఎక్కించారని గుర్తు చేశారు. నాటి ఘటనపై న్యాయవిచారణ లేదా కమిటీ వేస్తే వాస్తవాలు బయటపడతాయన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలంటే అప్పట్లో నిఘా విభాగాధిపతిగా ఉన్న వ్యక్తులతో కానీ, అప్పట్లో కేంద్రమంత్రి, ప్రస్తుత కేరళ గవర్నర్ ఆరిఫ్ ముహమ్మద్ వంటి వారిని అడిగి తెలుసుకోవాలని సూచించారు.
అవన్నీ అవాస్తవాలే
ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంలో పూర్తిగా అవాస్తవాలనే చూపించారని, ఫరూక్ అబ్దుల్లా కుమారుడు జమ్ముకశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. 1990 లో నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలో ఉన్నట్టు చూపించారు. కానీ ఆసమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్ పాలన లోనే ఉంది. అలాగే కేంద్రంలో బీజేపీ మద్దతు ఉన్న వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆనాడు మరణించిన వలస వెళ్లిన వారిలో కశ్మీర్ పండిట్లే కాదు, ముస్లింలు, సిక్కులు కూడా ఉన్నారు. వారెవరూ ఇప్పటికీ కశ్మీర్‌కు తిరిగి రాలేదు. అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. కశ్మీర్ పండిట్లను తిరిగి తీసుకొచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ తనవంతు ప్రయత్నం చేస్తోందని ఆయన ఇటీవల వెల్లడించారు.