Sunday, December 22, 2024

ప్రజలను సన్మార్గంలో నడిపేందుకు రాముడిని అల్లా పంపాడు: ఫరూఖ్ అబ్దుల్లా

- Advertisement -
- Advertisement -

ఉధంపూర్: ఓట్ల కోసమే బిజెపి శ్రీరాముడి పేరును వాడుకుంటోందని జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఆరోపించారు. శ్రీరాముడు అందరివాడని, ఆయన కేవలం హిందువులకు మాత్రమే దేవుడు కాదు అన్ని మతాలవారికి దేవుడేనని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. గురువారం ఉధంపూర్ జిల్లాలోని గర్నాయిలో జమ్మూ కశ్మీరు నేషనల్ పాంథర్స్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రస్తావిస్తూ, త్వరలోనే పరీక్షలు(ఎన్నికలు) జరగనున్నాయని, పెద్ద మొత్తంలో డబ్బు మూటలు ఇక్కడకు వస్తాయని ఆయన అన్నారు. మందిరం గురించి అమ్మక్కుమార్తెలకు పదేపదే చెబుతారని, అదే రోజున రామ మందిరం ప్రారంభమైనా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన వ్యాఖ్యానించారు.

దీంతో ప్రజలు పెరిగిన ధరలు, నిరుద్యోగం గురించి మరచిపోతారన్నది బిజెపి భావనని, తాము మాత్రమే రామ భక్తులమని బిజెపి నాయకులు భావిస్తారని అబ్దుల్లా విమర్శించారు. శ్రీరాముడు అందరివాడని, రాముడిని బిజెపి అమ్ముతోందని ఆయన ఆరోపించారు. శ్రీరాముడు హిందువులకు మాత్రమే దేవుడు కాడని, ముస్లిములు, క్రైస్తవులతోసహా అన్ని మతాలవారికి ఆయన దేవుడని అబ్దుల్లా చెప్పారు. అదే విధంగా అల్లా కూడా కేవలం ముస్లిములకే కాకుండా ప్రతి ఒక్కరి దేవుడని ఆయన అన్నారు.

ఇటీవలే మరణించిన పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ రచయిత ఒకరు ప్రజలకు సరైన దారి చూపించడానికే రాముడిని అల్లా ఈ భూమిపైకి పంపాడని చెప్పారని ఆయన తెలిపారు. రాముడికి తాము మాత్రమే భక్తులమని ఎవరైనా చెబితే వారు మూర్ఖులని ఆయన అన్నారు. అలా చెప్పేవారికి అధికార కాంక్ష తప్ప దేవుడిపై ప్రేమ లేదని ఆయన అన్నారు. ఈ రకమైన విద్వేష బీజాలను అంతం చేయాల్సిన అవసరం ప్రతిఒక్కరిపైన ఉందని ఆయన పిలుపునిచ్చారు. వారణాసిలో భారీఎత్తున గంగా హారతి జరుగుతుందని, అయితే ఆ దీపాల నుంచి నూనెను సేకరించడానికి పేద మహిళలు పోటీపడుతుంటారని, ఇదీ అక్కడి దుస్థితికి అద్దం పడుతుందని ఫరూఖ్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News