శ్రీనగర్: ఉమ్మడి పౌరస్మృతిని తీసుకు వచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్మూ, కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. ఉమ్మడి పౌరస్మృతి అంశంలో ప్రభుత్వం తొందరపడి నిర్ణయం తీసుకోరాదని ఆయన అన్నారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు విషయంలో పర్యవసానాలపై ఒకటి రెండు సార్లు ఆలోచించాలని ఆయన సూచించారు. ఉమ్మడి పౌరస్మృతిపై మళ్లీ ఆలోచించాలని, ఎందుకంటే ఇది భిన్నత్వం కలబోసిన దేశమని, ఇక్కడ భిన్న మతస్తులు, భిన్న జాతుల వారు ఉన్నారని, ముస్లింలకు ప్రత్యేకమైన షరియత్ చట్టం ఉందని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.
గురువారం నగరంలోని హజరత్ బాల్ దర్గాలో ఈదుల్ అజా ప్రార్థనల్లో పాల్గొనడం కోసం వచ్చిన అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.యూనిఫామ్ సివిల్ కోడ్‌ను అమలు చేస్తే ఏర్పడబోయే పరిణామాల గురించి ప్రభుత్వం మళ్లీ మళ్లీ ఆలోచించాలని, తొందరపడి నిర్ణయం తీసుకోరాదని అన్నారు. ఎందుకంటే ఆ తర్వాత తుఫాన్ వస్తుందని అబ్దుల్లా అన్నారు. అమరనాథ్ యాత్రకోసం జమ్మూకశ్మీర్‌ను సందర్శించే యాత్రికులను ఆయన స్వాగతించారు. ఈ యాత్ర విజయవంతం కావాలని, యాత్రికులు భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా తిరిగి వెళ్లాలని నేను అల్లాను ప్రార్థిస్తాను’ అని ఫరూక్ అబ్దుల్లా అన్నారు.