రాష్ట్రపతి రేసు నుంచి తప్పుకున్న ఫరూఖ్ అబ్దుల్లా
శ్రీనగర్: త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపాదిత ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిగా తన పేరును ఉపసంహరించుకుంటున్నట్లు జమ్మూ కశ్మీరు మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా శనివారం ప్రకటించారు. తాను చేయవలసిన క్రియాశీల రాజకీయాలు చాలా ఉన్నాయని, ప్రస్తుత సంక్లిష్ట దశ నుంచి కేంద్ర పాలిత ప్రాంతాన్ని గట్టెక్కించడానికి తాను కృషి చేయవలసి ఉందని ఆయన తెలిపారు. జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ప్రతిపక్షాల ప్రతిపాదత ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును తొలుత ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ ఉపసంహరించుకోగా ఇప్పుడు 84 ఏళ్ల ఫరూఖ్ అబ్దుల్లా ఉపసంహరించుకోవడం గమనార్హం. రాష్ట్రపతి ఎన్నికలలో ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు త్వరలోనే ముంబయిలో ప్రతిపక్షాలు సమావేశం కానున్న నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా ఈ ప్రకటన చేయడం చర్చనీయాంశమైంది. కాగా..ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించినందుకు ప్రస్తుతం లోక్‌సభ సభుడిగా కొనసాగుతున్న ఫరూఖ్ అబ్దుల్లా ప్రతిపక్షాలకు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తన పేరును పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మమతా బెనర్జీ తన పేరును ప్రతిపాదించిన తర్వాత తనకు పలువురు ప్రతిపక్ష నేతల నుంచి మద్దతు తెలియచేస్తూ ఫోన్ కాల్స్ వచ్చాయని, ఈ అనూహ్య పరిణామంపై తన పార్టీ సీనియర్ సహచరులు, కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత అభ్యర్థిత్వ ప్రతిపాదన నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థికి తన మద్దతు ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలియచేశారు. ఇటీవల కాంగ్రెస్, డిఎంకె, ఎన్‌సిపి, సమాజ్‌వాది పార్టీతోసహా 17 ప్రతిపక్షాలు పాల్గొన్న సమావేశంలో ఫరూఖ్ అబ్దుల్లా పేరును రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిగా మమతా బెనర్జీ ప్రతిపాదించారు. పోటీ చేయడానికి శరద్ పవార్ నిరాకరించడంతో అబ్దుల్లాతోపాటు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరును మమత సూచించారు. కొత్త రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జూన్ 15 నుంచి ప్రారంభం కాగా నామినేషన్ల దాఖలుకు జూన్ 29 చివరి తేదీ. అవసరమైతే జులై 18న పోలింగ్ జరుగుతుంది.