సవాళ్లను అధిగమించి 7 కి.మీ. మేర జోజిలా పనులు పూర్తి
అత్యాధునిక టెక్నాలజీ వినియోగించిన మేఘా సంస్థ
మనతెలంగాణ/హైదరాబాద్ : మౌలిక వసతుల రంగంలో అగ్రగామి సంస్థ, మేఘా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) ప్రతికూల వాతావరణంలో పలు సవాళ్లను అధిగమించి జోజిలా టన్నెల్ తవ్వకం పనులను అతి స్వల్ప కాలంలో సగం మేర పూర్తి చేసింది. హిమాలయాల్లో , నిరంతరంగా కురుస్తున్న మంచుతో పాటు తరచుగా వచ్చే మంచు తుపానుల వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పనులను వేగవంతంగా కొనసాగిస్తోంది. శ్రీనగర్-లద్దాక్‌ల మధ్య అన్ని కాలాల్లోనూ నిరంతర రాకపోకలను సాగించేందుకు వీలుగా నిర్మిస్తున్న ఈ టన్నెల్ నిర్మాణాన్ని భారీ హిమాలయ పర్వత శ్రేణులను తొలిచి వేగంగా పనులను చేస్తూ ఎంఈఐఎల్ తన సత్తాను మరోసారి నిరూపించుకుంది.
ఇలాంటి భౌగోళిక ప్రాంతంలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఈమేరకు పనులను పూర్తి చేయడం ప్రపంచంలోనే తొలిసారి. ఆసియాలోనే అతి పోడవైన, రెండు వైపులా ప్రయాణించేగలిగే ఈ టన్నెల్ రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. రోడ్డు రవాణా, జాతీయరహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఐడీసిఎల్) కోసం ఎంఈఐఎల్ ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నది. కేంద్ర రవాణా, రోడ్ వేస్ మంత్రి నితిన్ గడ్కరీ జోజిలా టన్నెల్ పనులను గతంలో ప్రారంభించారు. శ్రీనగర్-లేహ్ నగరాల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు వ్యూహాత్మకమైనది. సిల్క్ రూట్‌లో భాగంగా నిర్మిస్తున్న ఈ సొరంగ మార్గం దేశ రక్షణకు కీలకం కాగా, హిమాలయ ప్రాంత ఆర్థికాభివృద్దికి చాలా ముఖ్యమైనది.
జమ్ము కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాల సమీకృత అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకం కానుంది. ఎంఈఐఎల్ తనకున్న ఇంజినీరింగ్ నైపుణ్యం, అనుభవంతో జోజిలా ప్రాజెక్టును నిర్మిస్తున్నది. న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (ఎన్‌ఏటీఎం), స్నోబ్లోయర్స్, పేవర్స్, స్పెషలైజ్డ్ బూమర్స్ వంటి అత్యాధునిక యంత్రాలను, ఇంజినిరింగ్ పద్ధతులను వినియోగిస్తున్నది. అత్యంత ఎత్తైన ప్రాంతంలో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో కూడా ఎంఈఐఎల్ ప్రాజెక్టు పనులను ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగిస్తోంది. నిజానికి, కఠినమైన రాళ్ళు, భారీగా సీపేజీ ఉన్న భూభాగంలో డ్రిల్లింగ్‌తో పాటు సివిల్వ్క్స్‌న్రు చేయడం చాలా కఠినమైన పని. కానీ, క్లిష్టమైన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడంలో ఎంఈఐఎల్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ ప్రాజెక్టును కూడా నిబద్దతతో పూర్తి చేస్తున్నది. ఇప్పటి వరకు టన్నెల్ తవ్వకం పనులు సగం వరకు, 7,000 మీటర్లు (7కీ.మీ) మేర పూర్తయ్యాయి. జోజిలా రూట్‌లో నదిని దాటడానికి 815 మీటర్ల పొడవున నాలుగు బ్రిడ్జిలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉన్నాయి. బ్రిడ్జీల నిర్మాణం కోసం సబ్ స్ట్రక్చర్స్, ఫౌండేషన్లు పూర్తయ్యాయి.