Friday, September 20, 2024

పండుగ వేళ ఫాస్టాగ్ ఇక్కట్లు!

- Advertisement -
- Advertisement -

Fastag problems

 

మొరాయించిన స్కానర్లు.. టోల్‌ప్లాజాల వద్ద విపరీత రద్దీ
ఇటు పంతంగి టోల్‌గేట్.. అటు కీసర టోల్‌ప్లాజాల వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్
ఫాస్టాగ్ ఉన్న ప్రయోజనమేమిటి? వాహన చోదకుల పెదవి విరుపు

హైదరాబాద్ : సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో.. పట్న వాసులు పల్లెకు క్యూ కడుతున్న వేళ.. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, సొంత వాహనాల్లో తెలంగాణ నుంచి ఎపికి పయనమయ్యే వాహన చోదకులు ఆయా టోల్ ప్లాజాల వద్ద నానా అగచాట్లు పడుతున్నారు. పండుగ సమీపిస్తున్న రెండ్రోజుల ముందే తమ పల్లెలకు చేరుకోవాలన్నా టోల్‌ప్లాజాల వద్ద కొత్తగా అమల్లోకి తెచ్చిన ఫాస్టాగ్ విధానం వీరి ఆశలపై నీళ్లు జల్లుతోందని చెప్పక తప్పదు.

పంతంగి, కీసర టోల్‌ప్లాజాల వద్ద విపరీత రద్దీ
తాజాగా యాదాద్రి-భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండ లం పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. విజయవాడ వైపు వెళ్లేవారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్‌గేట్‌లో 8 టోల్ బూత్‌లను తెరిచారు. అయిప్పటికీ టోల్‌బూత్‌లలో స్కానర్లు సరిగా పనిచేయకపోవడంతో మళ్లీ పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకుని వాహనాలను పంపాల్సిన అగత్యం ఏర్పడింది. తెలంగా ణ వ్యాప్తంగా 17 టోల్‌ప్లాజాలలో ఇదే స్థితి నెలకొంది. అటు కృష్ణాజిల్లా నందిగామ వద్ద రహదారులు అన్నీ రద్దీగా మారాయి. హైదరాబాద్—విజయవాడ 65వ నెంబర్ జాతీయరహదారిపై ఉన్న టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లను ఏర్పాట్లు చేశారు. ఫాస్టాగ్‌పై వాహన చోదకుల్లో ఇంకా అవగాహన రాలేదు. పరిస్థితుల దృష్టా ఆయా టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్‌టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఆయా కౌంటర్ల ద్వారా వాహన చోదకులు ఫాస్టాగ్‌లను తీసుకుంటున్నారు.

స్కానర్లు మొరాయింపు..
ఆయా టోల్ ప్లాజాలను క్షణాల వ్యవధిలో దాటేందుకు అనువుగా ఫాస్టాగ్ విధానం ఉపయుక్తంగా ఉంటుందని వాహన చోదకులు అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయా టోల్‌ప్లాజాల వద్ద ఫాస్టాగ్ విధానం అమలుకు సంబంధించి స్కానర్లు మొరాయిస్తున్న దరిమిలా వాహనచోదకులు ఇదేమీ చోద్యం? అని అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. పైపెచ్చు ఆయా మార్గాలలో పలు టోల్‌ప్లాజాల వద్ద స్కానర్లు మొరాయిస్తున్న వేళ టోల్‌ప్లాజా నిర్వాహకులు మళ్లీ పాత పద్ధతిలో టోల్ ఫీజును వసూలు చేస్తున్న దరిమిలా కిలోమీటర్ల మేర వాహనాలు నిలుస్తున్నాయి.

దీంతో ఆయా ప్రాంతాల్లో పూర్తిగా ట్రాఫిక్ స్తంభిస్తోంది. ఈ క్రమంలో టోల్‌ప్లాజాల వద్ద అధికారులు తీసుకుంటున్న అస్తవ్యస్త విధానాలపై ప్రజలు మండిపడుతున్నారు. విద్యార్థులకు సెలవులిచ్చిన దృష్టా వారు సంక్రాంతి పండుగకు పట్నం నుంచి పల్లె బాట పట్టేందుకు సన్నద్ధులవుతున్నారు. ముందుగా వెళితే ఇబ్బందులు ఉండబోవని భావించిన వారికి ఫాస్టాగ్ రూపేణా ఇక్కట్లు దర్శనమిస్తున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోని జేబీఎస్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, ఉప్పల్ బస్టాప్‌లు ప్రయాణీకులతో కిటకిటలాడుతుండటం గమనార్హం.

పంతంగి టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండగకు వెళ్లే వాహనాలతో హైద్రాబాద్ విజయవాడ 65 వ నెంబర్ జాతీయ రహదారి శనివారం ఇసుకేస్తే రాలనంత రద్దీగా మారింది. పండగకు ఇంకా రెండు రోజులు మాత్రమే సమయం మిగిలి వుండడం, స్కూళ్లు కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో పట్టణంలోని ప్రజలు పండగకు బయలు దేరేందుకు పిల్లా పాపలతో కలిసి సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో రహదారి వాహన సంద్రంగా మారింది. హైద్రాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని దూర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు వేల సంఖ్యలో ఒక్కసారిగా రోడ్డెక్కడంతో జాతీయ రహదారిపై భారీగా రద్దీ పెరిగింది. దీంతో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్‌గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

టోల్‌గేట్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచి పోయాయి. ఫాస్ట్ ట్యాగ్ కౌంటర్లు అధికంగా ఉన్నా, ట్రాఫిక్ సమస్య మాత్రం తప్పలేదు. ఒక దశలో ఒకటి, రెండు పాస్ట్ ట్యాగ్ కౌంటర్లు మొరాయించడంతో పరిస్థితి చక్కబడే వరకు వాహన దారులకు తిప్పలు తప్పలేదు. ఉదయం, సాయంత్రం వేళలో వాహనాల సందడి అధికంగా కనిపించింది. వాహన దారులు, ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా పంతంగి టోల్‌గేట్ వద్ద జిఎంఆర్ సిబ్బంది ఎప్పటి కప్పుడు తగు చర్యలు చేపడుతున్నారు. ఏదేమైనా ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు చేయడం వల్ల గతంలో కన్నా కొంతమేర ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గాయని వాహన దారులు చెబుతున్నారు.

 

Fastag problems during the festival
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News