పెబ్బేరు :వనపర్తి జిల్లా పెబ్బేరు 44వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పసుపులోడుతో వెళ్తున్న లారీని కూరగాయల లోడుతో వెళ్తున్న డిసిఎం వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఇద్దరు రైతులు మృతి చెందారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై జగదీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ జిల్లా ఎమ్మిగనూర్ ప్రాంతానికి చెందిన డిసిఎం యజమాని, రైతు చిన్నలక్ష్మయ్య(42), రైతు గొల్ల రామకృష్ణ(39) కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు చెవులకాయ లోడుతో వెళ్తుండగా కడప నుంచి మహారాష్ట్రకు పసుపు లోడుతో వెళ్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీ కొట్టిందని తెలిపారు.
ఈ ప్రమాదంలో గొల్ల రామకృష్ణ, చిన్న లక్ష్మయ్యలు అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. పండించిన కూరగాయల పంట హైదరాబాద్‌లో అమ్మితే లాభం వస్తుందని నమ్మకంతో పసుపులోడుతో వెళ్తున్న లారీకు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్షంతో ప్రాణాలు కోల్పోయారని, డిసిఎం డ్రైవర్ యూసుఫ్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగదీష్ రెడ్డి తెలిపారు. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో పోలీసులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టి అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.