కన్న తల్లిదండ్రలని చూడకుండా.. ఓ దుర్మార్గుడు, శత్రువుల్లా వెంటాడి ట్రాక్టర్ తో వారిని తొక్కించి చంపేశాడు. ఈ దారుణ సంఘటన ఎపిలోని విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని చల్లవానితోట పంచాయతీ నడుపూరి కల్లాలు గ్రామానికి చెందిన పాండ్రంకి అప్పలనాయుడు(55), జయ(45)కు కుమారుడు రాజశేఖర్, కుమార్తె రాధాకుమారి ఉన్నారు. కూతురి పెళ్లి కోసం అప్పలనాయుడు తనకున్న 1 ఎకరం(100 సెంట్లు) భూమిలో 20 సెంట్లు అమ్మాడు. కూతురికి కొడుకు పుట్టిన తర్వాత అల్లుడు చనిపోయాడు. దీంతో కూతురు, మనవడిని తమ వద్దే ఉంచుకుంటున్నారు.
ఈ క్రమంలో మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని రాజశేఖర్ తల్లిదండ్రులను వేధించడం ప్రారంభించాడు. కొడుకు తీరు నచ్చని తల్లిదండ్రులు తమను చూసుకుంటున్న కూతురికి మరో 30 సెంట్ల భూమిని ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు. దీంతో తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్న రాజశేఖర్.. మిగిలిన భూమిలో కొంత అమ్మేందుకు ట్రాక్టర్‌తో చదును చేసేందుకు ప్రయత్నించాడు. దీనిని అడ్డుకున్న తల్లిదండ్రుల పైకి ట్రాక్టర్ తీసుకెళ్లాడు. భయంతో వారు పరుగులు పెట్టినా.. వదలకుండా వెంటాడి ట్రాక్టర్‌తో వెళ్లి వారిని తొక్కించేశాడు. దీంతో తీవ్ర గాయాలై తల్లిదండ్రులు అక్కడికక్కడే చనిపోయారు. అనంతరం రాజశేఖర్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.