జన్నారం: జన్నారం మండలం కలమడుగు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు జోగు సాయికుమార్ (37) అతడి కుమారుడు జోగు లక్ష్మణ్ (7) అక్కడికక్కడే మృతి చెందారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆదిలాబాద్ వైపు నుండి జగిత్యాల వైపు దారం బెండలతో వెళ్తున్న ఐచర్ వ్యాన్ కలమడుగు గ్రామ బస్టాండ్‌లో ఓ వ్యక్తి జ్ఞాపకార్థంగా ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లపై కూర్చున్న జోగు సాయికుమార్, కుమారుడు లక్ష్మణ్ లను ఐచర్ వ్యాన్ ఢీ కొట్టింది. వారిని ఢీకొట్టిన అనంతరం ఐచర్ వ్యాన్ సమీపంలో ఉన్న విద్యుత్తు స్థంభాన్ని కూడా వేగంగా ఢీ కొట్టింది. దీంతో స్థంభం విరిగి కింద పడింది. వ్యాన్ మరి కొంత దూరం దూసుకెళ్లి మరో ఇల్లును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృతి చెందడంతో పాటు, కరెంటు స్థంభం విరిగిపడింది. ఇల్లు స్వల్పంగా దెబ్బతింది.
వాహనం డ్రైవర్ మద్యం మత్తులో అతి వేగంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో విద్యుత్తు స్థంభం విరిగి కింద పడడంతో క్షణాల్లో ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగాయి. సంఘటనను గుర్తించిన బస్టాండ్‌లో ఉన్న పలువురు వెంటనే విద్యుత్తు సిబ్బందికి ఫొన్ చేయడంతో విద్యుత్తు సిబ్బంది విద్యుత్తు సరఫరా నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్ రమేష్, క్లీనర్ అశోక్ తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించగా వారిని గ్రామస్తులు పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటనా స్థలంలో జన్నారం ఎస్‌ఐ సతీష్, దండేపల్లి ఎస్‌ఐ లక్ష్మణ్ బందోబస్తు నిర్వహించారు. మృతుడి భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు జన్నారం ఎస్‌ఐ సతీష్ తెలిపారు.
బతుకు దెరువుకు వచ్చి ప్రాణాలు విడిచారు
మెదక్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన జోగు సాయికుమార్, మంజుల వారి కొడుకు లక్ష్మణ్‌లతో కలసి జన్నారం మండలం రెండ్ల గూడ గ్రామంలో కుతుబుద్దీన్‌కు చెందిన ఢైరీ ఫాంలో పనులు చేస్తున్నారు. వారు రెండు సంవత్సరాలుగా రెండ్లగూడలోనే నివాసం ఉంటున్నారు. గురువారం తమ స్వగ్రామం అనంతారంకు వెళ్లేందుకు రెండ్లగూడ నుండి కలమడుగుకు చేరుకున్నారు. జగిత్యాల బస్సు కోసం ఎదురు చూస్తూ బస్టాండ్‌లో ఉన్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నారు. మంజుల నీరు తాగేందుకు పక్కకు వెళ్లగా అదే సమయంలో ఐచర్ వ్యాన్ అతి వేగంగా వచ్చి బల్లపై కూర్చున్న వారిని ఢీకొట్టడంతో బెంచి మీద కూర్చున్న సాయికుమార్, లక్ష్మణ్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటన చూసిన మంజుల బోరున విలపించింది. మంజుల కుటుంబం పేదవారు కావడంతో వారి అంత్యక్రియలు చేసే స్థోమత కూడా లేక పోవడంతో గ్రామస్తులు జోలె పట్టి చందాలు వసూలు చేసారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రమాదానికి కారణమై రెండు ప్రాణాలను బలికొన్న వాహనం డ్రైవర్‌పై కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేసారు.