రాగి తీగ దొంగతనానికి వచ్చి కరెంట్ షాక్ తగలడంతో తండ్రి, కొడుకులు మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా, మిడ్జిల్ మండలం, బోయిన్‌పల్లి ప్రగతి సోలార్ ప్లాంట్‌లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివనాగేశ్వర నాయుడు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం…ప్రగతి సోలార్ ప్లాంట్‌లో గతంలో రాగి తీగ దొంగతనాలు జరిగిన నేపథ్యంలో ప్లాంట్ చుట్టూ యాజమాన్యం రెండంచెల సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ప్లాంట్ లోపల భాగంలో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో జోగులాంబ గద్వాల జిల్లా,
ఇటిక్యాల మండలానికి చెందిన బాలస్వామి (42) అతని కుమారుడు జయరాజ్ (17) సోలార్ ప్లాంట్‌లో రాగి తీగ దొంగతనం చేసే ఉద్దేశంతో ఔటర్ ఫెన్సింగ్‌ను కట్ చేసి ఇన్నర్ ఫెన్సింగ్‌ని పట్టుకోగా షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. కరెంట్ షాక్‌తో మరణించిన ఈ తండ్రి, కొడుకుల మృదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దొంగతనం జరిగిన స్థలంలో వైర్ కట్టర్లు, ఒక టవర్ లోపల రాళ్లు, గోనెసంచులు లభించాయి. రాగి తీగ దొంగిలించే ఉద్దేశంతోనే ఫెన్సింగ్ కట్ చేసి సోలార్ ప్లాంట్ లోపలికి వచ్చారని ప్రాథమిక విచారణలో తెలిసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.