సిటిబ్యూరోః ఎల్‌బి నగర్ ప్రేమోన్మాది దాడి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. నిందితుడు గతంలో చేసిన నేరాలు, అతడి నేరప్రవృత్తిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితుడు శివకుమార్ కత్తులు, తుపాకులు, అమ్మాయిలతో చేసిన డ్యాన్సులు, జల్సాలకు సంబంధించిన రీల్స్ వీడియోలు బయటికి వచ్చాయి. ఎల్బీనగర్‌లోని ఆర్టీసీ కాలనీలో ఉంటూ హోమియోపతి నాలుగో సంవత్సరం చదువుతున్న సంఘవి, ఆమె సోదరుడు పృథీపై ఆదివారం మధ్యాహ్నం శివకుమార్ కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఆదివారం మధ్యాహ్నం యువతి ఇంటికి వెళ్లి ఆమెపై, అడ్డొచ్చిన తమ్ముడిపై విచక్షణారహితంగా దాడి చేశాడు.
ఈ ఘటనలో యువతి తమ్ముడు పృథ్వీ(చింటు) మరణించగా యువతి ఏఐజి ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది. అయితే ఇంతటి అఘాయిత్యానికి తెగబడ్డ నిందితుడు శివకుమార్ నేర చరిత్రపై ఇప్పుడు పలు కథనాలు వినిపిస్తున్నాయి. దీంతో పోలీసులు నిందితుడి గత నేర చరిత్రపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు శివ మొదట్నుంచి కోపిష్టి అని. మందిలించిన కన్నతండ్రిని కూడా దారుణంగా హత్య చేశాడని తెలుస్తోంది. మెరుగైన వైద్యం కోసం సంఘవిని ఎఐజి ఆస్పత్రికి తరలించగా, పృథ్వీ మృతదేహానికి ఉస్మానియాలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మందలించినందుకు తండ్రి హత్య
రంగారెడ్డి జిల్లా, నేరెళ్ల చెరువు గ్రామానికి చెందిన శివకుమార్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. తర్వాత సినిమాల్లో నటించేందుకు అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాడు. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో హైదరాబాద్ కొద్దిరోజులు ఖాళీగా తిరిగాడు. ఇలా పనిపాట లేకుండా శివ ఖాళీగా తిరుగుతుండటంతో ఇంట్లో గొడవలు జరిగాయి. దీంతో మూడేళ్ల క్రితం శివను అతడి తండ్రి మందలించాడు, ఆగ్రహం చెందిన శివకుమార్ కన్నతండ్రిని సుత్తితో తలపై కొట్టడంతో మృతిచెందాడు. అయితే కుటుంబంలో ఒక్కడే మగ పిల్లాడు కావడంతో వాళ్ల కుటుంబం రోడ్డున పడకూడదనే ఉద్దేశంతో గ్రామ పెద్దలు ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుని అంత్యక్రియలు నిర్వహించారు. శివకుమార్ తండ్రిది సహజ మరణంగా అప్పుడు నమ్మించారని గ్రామస్తులు ఇప్పుడు గుర్తు చెసుకుంటున్నారు. శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నేర చరిత్రపై ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే శివకు సంబంధించిన పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
పదో తరగతి నుంచే వేధింపులు…
ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ సంఘవి స్వస్థలం రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం. సంఘవి, శివ ఇద్దరూ షాద్‌నగర్‌లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు. అప్పటి నుంచే శివకుమార్ తనను ప్రేమించాలని సంఘవి వెంట పడేవాడు. ఈ విషయం తెలియడంతో సంఘవి కుటుంబ సభ్యులు అప్పుడే శివను హెచ్చరించారు. అయినా కూడా తనను ప్రేమించాలని శివ, సంఘవి వెంటపడేవాడు. ఈ క్రమంలోనే సంఘవి హైదరాబాద్ వచ్చి రామాంతాపూర్ హోమియో కాలేజీలో చేరినప్పటికీ తన వేధింపులు ఆపలేదు. తనను ప్రేమించాలని.. పెండ్లి చేసుకోవాలని పదే పదే ఆమెను విసిగించేవాడు. అయినా కూడా సంఘవి శివకుమార్ ప్రేమను తిరస్కరించేది, దీంతో సంఘవిపై కోపం పెంచుకున్న శివ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో సంఘవి ఉంటున్న ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో ఇంట్లో సంఘవి, పృథ్వీ మాత్రమే ఉన్నారు. వచ్చి రావడంతోనే సంఘవితో గొడవపడ్డాడు, ఆపై వెంట తీసుకొచ్చిన కత్తులతో దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న పృథ్వీ అడ్డుకునే ప్రయత్నం చేయగా కత్తితో అతడి ఛాతీపై బలంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పృథ్వీతేజ గాయం నుంచి రక్తం బయటకు రాకుండా చేత్తో అదిమిపట్టి బయటకు వచ్చి పక్కింట్లో ఉండే ఝాన్సీ అనే మహిళకు విషయం చెప్పి రోడ్డుపైకి పరుగులు తీశాడు. పృథ్వీ బయటకు వెళ్లిపోవడంతో సంఘవిని బెడ్రూంలోకి తీసుకెళ్లిన శివకుమార్ దాడికి పాల్పడ్డాడు. ఝాన్సీ ఇచ్చిన సమాచారంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి వస్తూ మార్గమధ్యంలో స్పృహతప్పి పడిపోయిన పృథ్వీని ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయినట్టు వెల్లడించారు.
బయటికి వచ్చి చంపుతాడేమోః బాధితురాలి సోదరులు
తమ సోదరిపై దాడి చేసిన శివకుమార్‌ను కఠినంగా శిక్షించాలని ఆమె సోదరులు శ్రీనివాస్, రోహిత్ డిమాండ్ చేశారు. పోలీసులు శివకుమార్‌ను అరెస్టు చేసినా జైలు నుంచి బేయిల్‌పై బయటికి వచ్చి తమ సోదరిని చంపుతాడేమోనని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఇంలాంటి సంఘటన తమ ఇంట్లో జరగుతుందని ఊహించలేదని, శివకుమార్ పదోతరగతి నుంచి మా అక్కను వేధిస్తున్నాడని చెప్పాడు. గది మొత్తం రక్తపు మరకలతో నిండిందని, శివకుమార్ సోదరి కూడా తన తమ్ముడిని వివాహం చేసుకోవాలని తమ అక్కను వేధించినట్లు తమకు తెలిసిందని చెప్పారు.