పెబ్బేరు : క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. మమకారంతో కని పెంచుకున్న బిడ్డలపై కసి పెంచుకుంటూ కడతేర్చుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దేవుడు నుదుటి రాత రాస్తే క్షణికావేశంతో మనుషులు ఆ రాతను తుడుపేసుకుంటున్నారు. కుటుంబంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న చిన్న వివాదంలో పసి పిల్లలను సైతం కాల్వల్లోకి తోసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంగళవారం పెబ్బేరు మండలం పాతపల్లి సంఘటనలో గ్రామానికి చెందిన అబ్బాయిని ప్రేమించిందని 10వ తరగతికి చదుతున్న యువతి (గీత)ను కన్న తండ్రి హత్య చేశాడు. ఎన్నిసార్లు మందలించిన మార్పు రాకపోవడంతో హత్యకు పూనుకున్నాడు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయాలతో ఆవేశంతో తను ఏమి చేస్తున్నది తనకే తెలియని పరిస్థితిలో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఇలాంటి సంఘటనలు గ్రామాల్లో ఎదురైనప్పుడు పెద్దల సమ్మతితో పంచాయతీలు పెట్టి సర్ధుబాటు చేసేవారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. చిన్న చిన్న కుటుంబాలు ఉండడం వల్ల ఆర్ధిక ఇబ్బందుల్లో, అవమానాలతో తనువులు చాలిస్తున్నారు. చిన్న చిన్న కలహాలకే భవిష్యత్‌ను అంధకారం చేసుకుంటున్నారు. కొందరు మద్యం, జూదం, ఆన్‌లైన్ లోన్ యాప్ లకు బానిసలై జీవితాలను అగమ్య గోచరంగా మార్చుకుంటున్నారు. గోటితో పోయే వాటిని గొడ్డలి దాకా తెచ్చి అభం శుభం తెలియని పిల్లల ప్రాణాలను సైతం తీస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. మానవీయ విలువ లేని సమాజం ఎటు వెళ్తుందని దానికి సమాధానం లేకపోవడం దురదృష్టకరం. అలాంటి విషాద ఘటనలు జరగకూడదని కోరుకుందాం.