Sunday, December 22, 2024

పెద్ద దిక్కును కోల్పోయిన వ్యవసాయ రంగం ..స్వామినాథన్ మృతిపై ప్రముఖుల సంతాపాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ పలువురు నేతలు సందేశాలు పోస్ట్ చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీతోపాటు అధికార, విపక్ష నేతలతోసహా అనేక మంది దేశానికి ఆయన చేసిన విశేష సేవలను గుర్తు చేసుకుంటున్నారు. దేశ వ్యవసాయ రంగం పెద్దదిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆహార భద్రత కోసం శ్రమించిన గొప్ప దార్శనికుడు : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ మృతి తీరని ఆవేదన కలిగించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతాపం వెలిబుచ్చారు. మానవాళికి సురక్షితమైన , ఆకలిలేని భవిష్యత్తును సృష్టించడానికి మార్గనిర్దేశం చేసే వెలుగుగా ఉపయోగపడే గొప్ప వారసత్వాన్ని స్వామినాథన్ మనకు మిగిల్చారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు.ఆహార భద్రత కోసం విశేష కృషి చేసిన గొప్ప దార్శనికుడుగా కొనియాడారు. వ్యవసాయ రంగంలో ఎన్నో ఆవిష్కరణలు నమోదు చేశారని, పద్మవిభూషణ్, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ వంటి అవార్డులు ఎన్నో సాధించారని గుర్తు చేశారు. భారతీయ వ్యవసాయ క్షేత్రంలో ఆయన చెరగని ముద్రవేశారన్నారు.

సంక్లిష్ట కీలక దశలో అద్భుతం చేశారు. : ప్రధాని మోడీ
స్వామినాథన్ మృతి తనను బాధకు గురి చేసిందని, ప్రధాని మోడీ తన ఎక్స్ అకౌంట్‌లో నివాళి అర్పించారు. చాలా కీలకమైన దశలో స్వామినాథన్ చేసిన అద్భుత కృషి వల్ల వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, దానివల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు తీసుకురాగలిగారని, దేశంలో ఆహార భద్రత ఏర్పడిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక కృషితోపాటు ఆవిష్కరణలకు ఆయన ఓ పవర్‌హౌస్‌గా మార్గం చూపారని పేర్కొన్నారు. పరిశోధన రంగంలో ఆయన చూపిన మార్గాన్ని అనేక మంది యువ శాస్త్రవేత్తలు అనుసరించారని కొనియాడారు. స్వామినాథన్‌తో ఎన్నో గత స్మృతులు ఉన్నట్టు పేర్కొన్నారు. భారత దేశ ప్రగతి కోసం ఆయన తపించారన్నారు. ఆయన జీవితం, పనితనం తరతరాలుగా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. స్వామినాథన్ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటిస్తున్నట్టు ప్రధాని వెల్లడించారు.

దేశానికి ఆహార భద్రత చేకూర్చిన స్వామినాథన్ : ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్
స్వామినాథన్ మరణం తనను ఎంతో బాధించిందని ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖర్ సంతాపం వెలిబుచ్చారు. భారత హరిత విప్లవానికి ఆయన పితామహుడని, వ్యవసాయ విప్లవంతో కొన్ని లక్షల మంది రైతుల భవితవ్యానికి వెలుగు తీసుకొచ్చి దేశానికి ఆహర భద్రత చేకూర్చారని గుర్తు తెచ్చుకున్నారు. స్వామినాథన్ కుటుంబానికి, ఆయన అభిమానులకు, స్నేహితులకు సంతాపం వెలిబుచ్చారు.

ఎప్పటికీ గుర్తుండిపోతారు : రాహుల్
స్వామినాథన్ మరణం పట్ల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విచారం వ్యక్తం చేశారు. మనదేశ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చేందుకు స్వామినాథన్ నిబద్ధత, ఆయన చేసిన కృషి ఈరోజు మనల్ని ఆహార ధాన్యాల మిగులు దేశంగా మారిందని కొనియాడారు. హరిత విప్లవ పితామహుడిగా ఆయన వారసత్వం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. ఈ కష్ట సమయంలో ఆయనను అభిమానించే వారందరికీ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన సంతాపాన్ని తెలియజేస్తూ భారత హరిత విప్లవానికి స్వామినాథన్ ముఖ్యమైన రూపశిల్పిగా అభివర్ణించారు. 1970 లలో వరి, గోధుమ దిగుబడిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిజైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆయన చేసిన కృషి కొన్ని లక్షల మంది జీవితాలను మార్చిందని, ఆయన విజన్‌ను తాము అవసరమైనప్పుడెల్లా అనుసరిస్తున్నామని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తెలియజేశారు.

రైతులకు ఎంఎస్‌పి సిఫారసు చేసింది ఆయనే : సిపిఎం
1960 ప్రాంతంలో అధిక దిగుబడినిచ్చే గోధుమలు, వరి రకాలను అభివృద్ధి చేయడంతోపాటు వాటిని ప్రచారం చేయడంలో ఆయన కృషికి గుర్తింపుగా వరల్డ్ ఫుడ్‌ప్రైజ్‌ను అందుకున్న తొలి వ్యక్తి స్వామినాథన్ అని సీపీఎం పొలిట్‌బ్యూరో గుర్తు చేసింది. 1988లో స్వామినాథన్ రీసెర్చి ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారని పేర్కొంది. రైతుల జాతీయ కమిషన్‌కు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించాలని సిఫారసు చేశారని, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం ధర నిర్ణయించాలని సూచించారని గుర్తు చేసింది. రైతుల పోరాటాల్లో ఈ అంశం ఇప్పటికే ఓ ప్రధాన డిమాండ్‌గానే ఉందన్న అంశాన్ని గుర్తు చేసింది. ఆ మహనీయుడి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది.

ప్రపంచ వ్యవసాయంపై స్వామినాథన్ ప్రభావం : తమిళనాడు సిఎం స్టాలిన్
వ్యవసాయ రంగంలో ఆయన చేసిన పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రపంచ వ్యవసాయం రంగంపై ఎంతో ప్రభావం చూపించాయని, ముఖ్యంగా సుస్థిర ఆహార భద్రత కు ఆయన చేసిన కృషి ప్రపంచానికే ఆదర్శమైందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. స్టాలిన్ అభివర్ణించారు. స్వామినాథన్ ఆధునిక భారత నిర్మాతని తమిళనాడు గవర్నర్ రవి ప్రశంసించారు.
వ్యవసాయ పురోగతికి అపార సేవ : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య
భారత వ్యవసాయ పురోగతికి, తద్వారా ఆర్థిక ప్రగతికి స్వామినాథన్ అపారమైన సేవలు అందించారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య పేర్కొన్నారు. స్వామినాథన్ మృతికి తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.
స్వామినాథన్ సలహాలతో ముందుకు నడిచా : మాజీ ప్రధాని దేవెగౌడ
అనేక సందర్భాలలో స్వామినాథన్ సలహాలు తనకు ఎంతో ప్రయోజనం కలిగించి ముందుకు నడిపించాయని మాజీ ప్రధాని దేవెగౌడ పేర్కొన్నారు.

ముగిసిన వ్యవసాయ పరిశోధనా శకం :ఐఎఆర్‌ఐ డైరెక్టర్ ఎ.కె. సింగ్
స్వామినాథన్ మృతితో వ్యవసాయ పరిశోధన శకం, వ్యవసాయ విజ్ఞానం, విస్తరణ, నిర్మాణాత్మక ఆవిష్కరణల ఘట్టాలు ముగిశాయని ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ ఎకె సింగ్ తన సంతాపంలో పేర్కొన్నారు.
స్వామినాథన్ తెచ్చే మార్పులు దేశం గుర్తుంచుకుంటుంది : రాకేష్ తికాయత్
దేశ వ్యవసాయ రంగంలో , రైతుల జీవితాల్లో స్వామినాథన్ తీసుకు వచ్చిన సానుకూల పురోగతి మార్పులను దేశం నిరంతరం గుర్తుంచుకుంటుందని రాజస్థాన్ నాయకుడు రాకేష్ తికాయత్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News