మహాశివరాత్రి పర్వదినాన విషాదం చోటు చేసుకుంది. లంగర్‌హౌస్ చెరువులో మునిగి తండ్రీ, కొడుకులు మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే… జిహెచ్‌ఎంసి ఔట్‌సోర్సింగ్ కార్మికుడు కరీం(42) తన కుమారుడు సాహిల్ తో కలిసి లంగర్ హౌజ్ వద్దకు సరస్సులో క్లీనింగ్ పనులు చేయడానికి వెళ్లాడు. అనంతరం ఇద్దరూ లంగర్ హౌజ్ సరస్సు వద్దకు వచ్చి నీటిలోకి దిగారు. సాహిల్ చెరువుని శుభ్రం చేసే క్రమంలో సాహిల్ లోతైన ప్రాంతానికి వెళ్లడంతో అక్కడ బురదలో ఇరుక్కుపోయాడు. తన తండ్రిని సహాయం కోరడంతో తండ్రి వెళ్లి కొడుకు చేయిపట్టే క్రమంలో ఇద్దరూ బురదలో ఇరుక్కుపోయారు. ఇద్దరూ క్షణాల్లో ప్రాణాలు కోల్పోయారు. డిఆర్‌ఎఫ్ టీమ్ ఘటన స్థలానికి చేరుకొని ఇద్దరు మృతదేహాలని వెలికి తీసింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
‘వారు ఈతకు వెళ్లి సరస్సులో మునిగిపోయారని మేము తెలుసుకున్నాము‘ అని గోల్కొండ ఎసిసి సయ్యద్ ఫైజ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న కార్వాన్ ఎంఎల్‌ఎ కౌసర్ మొహిద్దీన్ అక్కడికి చేరుకున్నారు. ఈసందర్భంగా ఎంఎల్‌ఎ కౌసర్ మొహిద్దీన్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్షం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఎలాంటి రక్షణ చర్యలు లేకుండా కనీసం లైఫ్ జాకెట్లు కూడా ఇవ్వకపోవడంతోనే బుధవారం తండ్రీకొడుకులు మృతి చెందారన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ తరపున సహకారం అందిస్తామన్నారు.