Monday, November 25, 2024

పెరుగుతున్న ఫ్యాటీ లివర్ బాధితులు

- Advertisement -
- Advertisement -

పెరుగుతున్న ఫ్యాటీ లివర్ బాధితులు
పట్టణాలలో 25 శాతానికి పైగా, గ్రామీణ ప్రాంతాలలో 20 శాతం మందిలో ఫ్యాటీ లివర్ సమస్య
ఎఐజీ హాస్పిటల్ సర్వే వెల్లడి
ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో వచ్చిన ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారు
ఎఐజి హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలో ప్రతి 10 మందిలో నలుగురు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు ఎఐజీ హాస్పిటల్ నిర్వహించిన సర్వేలో తేలింది. పట్టణాలలో 25 శాతానికి పైగా, గ్రామీణ ప్రాంతాలలో 20 శాతానికి పైగా ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది. అంతర్జాతీయ నాన్-ఆల్కహాలిక్ స్టీటో హెపటైటిస్(నాష్) దినోత్సవం సందర్భంగా, ఫ్యాటీ లివర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించడానికి గురువారం ఎఐజి హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్వే ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎఐజి హాస్పిటల్ ఛైర్మన్, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, జీవన శైలిలో మార్పు వచ్చినా దాని ప్రభావం కాలేయంపై పడుతోందని, ఫలితంగా ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఉన్న చాలామందిలో లక్షణాలు కనబడవని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కాలేయ వ్యాధులను గుర్తించేందుకు తాము నిర్వహించిన పరీక్షల్లో 20 శాతం మంది ప్రజలు ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న తేలిందని వెల్లడించారు. ఎలాంటి చెడు వ్యసనాలు లేకపోయినా… జన్యుపరమైన కారణాలు, బరువు కారణంగాను ఫ్యాటీ లివర్ బాధితులు పెరుగుతున్నారని తెలిపారు.

ఫ్యాటీ లివర్ సైలెంట్ కిల్లర్ అని,ఈ సమస్యకు సకాలంలో గుర్తించకపోతే అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు.
ఎఐజీ హాస్పిటల్ హెపటాలజీ విభాగం డైరెక్టర్ డాక్టర్ మిథున్ శర్మ మాట్లాడుతూ, తమ క్లినికల్ ప్రాక్టీస్ డేటాను క్రోడీకరించి పరిశీలిస్తే పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాటీ లివర్ సమస్య దాదాపు ఒకే విధంగా ఉందని తేలిందని అన్నారు. ఈ సమస్యకు ఊబకాయం, అనియంత్రిత మధుమేహం,అధిక రక్తపోటులే ప్రధాన కారకాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఫ్యాటీ లివర్ నిర్వహణ అనేది కేవలం కాలేయానికి మాత్రమే కాకుండా రక్తంలో చక్కెర, రక్తపోటు, ఊబకాయం వంటి వాటికి సమర్థవంతమైన చికిత్సను అందించవలసి ఉంటుందని తెలిపారు.

ఫ్యాటీ లివర్ సమస్యకు సకాలంలో చికిత్స అందిస్తే నయం చేయవచ్చని, నిర్లక్షం చేస్తే లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి దారితీయవచ్చని చెప్పారు. ఫ్యాటీ లివర్ వ్యాధిని ఎదుర్కోవడంలో ప్రజల అవగాహన ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని అన్నారు. బరువు తగ్గడం, ఆహారంలో క్యాలరీల తగ్గింపు, వ్యాయామం,ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటివి అలవాటు చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని చెప్పారు. ప్రతి ఒర్కరూ రోజుకు 30 నిమిషాల పాటు శారీరక శ్రమ, కూరగాయలు, పప్పులు,లీన్ చికెన్ మాంసం, చేపలు వంటి పీచుపదార్థాలు తీసుకోవడం, చక్కెర, స్వీట్లు, శీతల పానీయాలు వంటి కార్బోహైడ్రేట్ అధికంగా ఉండే అధిక కేలరీలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండటం, జీవనశైలి మార్పులతో చాలా వరకు సమస్యను తగ్గించవచ్చని అన్నారు. ఇప్పటికే డయాబెటిస్, హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్న మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రక్తపోటును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కలిగి ఉండటం, జీవనశైలి మార్పులతో ఫ్యాటీ లివర్ సమస్యను అధిగమించవచ్చని పేర్కొన్నారు. కానీ ఫ్యాటీ లివర్ వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే మాత్రం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని తెలిపారు.

Fatty Liver disease rise in Urban and Rural Areas: AIG Survey

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News