Wednesday, April 2, 2025

యువతలో ఫ్యాటీ లివర్ డేంజర్

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో ఫ్యాటీ లివర్ (కొవ్వు కాలేయం) కేసులు రానురాను ముంచుకొస్తున్నాయి. ఈ కేసుల ప్రాబల్యం 9 శాతం నుంచి 38 శాతం వరకు అమాంతంగా పెరిగిందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 2023 లో ఎయిమ్స్ నిర్వహించిన అధ్యయనంలో దాదాపు 35 శాతం కేసులు పిల్లల్లోనే సంభవిస్తున్నాయని గుర్తించారు. గతంలో ప్రతి 1015 మందిలో ఒకరికి ఈ సమస్య గుర్తిస్తే ప్రస్తుతం ప్రతి ఇద్దరిలో ఒకరికి ఫ్యాటీలివర్ కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో 30 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఫ్యాటీ లివర్ బాధితులున్నారు. ముఖ్యంగా యువతలో ఫ్యాటీలివర్ ముప్పు పెరుగుతోంది.

ఐటి ఉద్యోగుల్లో పని ఒత్తిడి, కదలికలేని నిశ్చల జీవనశైలి, కారణంగా 80% మందిలో ఫ్యాటీ లివర్ పొంచి ఉంటోందని వైద్య నిపుణుల అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలోని ప్రతి అవయవాన్ని సక్రమంగా పనిచేయించే బాధ్యత తీసుకునేది కాలేయమే. కాలేయం జీర్ణవ్యవస్థకు అనుబంధంగా ఉన్న అతిపెద్ద గ్రంథి. ఇది 500కు పైగా ప్రాణాధార పనులు చేస్తుందని, కొవ్వు దశలవారీ పెరిగిపోతే కాలేయం తన విధులను నిర్వర్తించడం మానేస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఆహారం మొదలు మందుల వరకు కాలేయం మీదుగానే ప్రయాణం సాగిస్తాయని అంటున్నారు.

కాలేయ కణజాలంలో 5% కంటే ఎక్కువ కొవ్వు ఉన్నప్పుడు ఫ్యాటీ లివర్ వ్యాధి వస్తుంది. ఫ్యాటీలివర్ తనకుతాను ప్రమాదకారి కాకపోయినా, దీని లక్షణాలు సకాలంలో గుర్తించకపోతే సింపిల్ ఫ్యాటీ లివర్, ఇన్‌ఫ్లెమేషన్ (స్టీటోహెపటిటిస్),ఫైబ్రోసిస్, సిర్రోసిస్ అనే నాలుగు దశల్లో ఫ్యాటీ లివర్ పెరిగిపోతుంది. సిర్రోసిస్ పెరిగితే కాలేయం దెబ్బతినడం శాశ్వతమవుతుంది. కాలేయం పూర్తిగా చెడిపోతేనే కానీ ఫ్యాటీలివర్ (కొవ్వు కాలేయం) లక్షణాలు బయటపడవు. ఫ్యాటీ లివర్ ప్రారంభంలో కనిపించే లక్షణాలపై ఎవరికీ అవగాహన సరిగ్గా ఉండడం లేదు.

అందుకని ఫ్యాటీ లివర్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ లక్షణాలపై అవగాహన కల్పించడానికి కొన్ని వైద్య సంస్థలు ప్రచారాన్ని ప్రారంభించాయి. ఫ్యాటీ లివర్‌ను చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్‌తో సహా మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఫ్యాటీలివర్ వ్యాధులు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎఎఫ్‌ఎల్‌డి), నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డీ) అనే రెండు రకాలు. మద్యపానం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి) చాలా మంది యువకుల్లో సర్వసాధారణంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్ డిజార్డర్లు) అంటే ప్రొటీన్లు, కొవ్వులు, కార్బొహైడ్రేట్లు వంటి స్థూలపోషకాలను శరీరంలో నిర్వహించడం, పంపిణీని చేయడం వంటి ప్రక్రియలు సరిగ్గా జరగకపోవడం వల్ల వచ్చే రుగ్మతలు. శరీరంలో సాధారణ జీవక్రియను అసాధారణ రసాయన ప్రతిచర్యలు మార్చినప్పుడు జీవక్రియ రుగ్మతలు సంభవిస్తాయి. అలాంటి రుగ్మతలు ఉన్నవారిలో ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి కనిపిస్తుంది. ఆల్కహాలు అలవాటు లేని వారిలో అధిక బరువు, మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ సమ్యలతో నాన్‌ఆల్కహాలిక్ ఫ్యాటీలివర్ ముప్పు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే కాలేయం వాపు వచ్చి, సరిగ్గా పనిచేయలేని పరిస్థితి ఏర్పడితే హెపటిటిస్ వ్యాధి ఏర్పడుతుంది.

వైరల్ వ్యాపించడం వల్ల ఇది దాపురిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 2030 నాటికి హెపటిటిస్‌ను పూర్తిగా నిర్మూలించాలన్న లక్షాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశిస్తోంది. ఏటా జులై 28 ని ప్రపంచ హెపటిటిస్ దినంగా పరిగణిస్తున్నారు. రొటీన్‌గా హెల్త్ స్క్రీనింగ్ చేసేటప్పుడు ఈ కేసులు బయటపడుతున్నాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. 2021లో 50 అధ్యయనాల నుంచి వెలువడిన 62 డేటాలను విశ్లేషించగా, దేశంలోని పెద్దల్లో 38 శాతం మందికి ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డీ ఉన్నట్టు బయటపడింది. ఈ కేసుల్లో 53.5 శాతం చండీగఢ్ కేసులే కనిపించాయి.

అలాగే పిల్లల్లో 35 శాతం వ్యాపించినట్టు బయటపడింది. ఎందుకు ఈ విధంగా కేసులు అకస్మాత్తుగా పెరిగిపోతున్నాయని పరిశీలిస్తే నగరీకరణ విస్తరించి ఆధునిక జీవనశైలి లోను, ఆహారపు అలవాట్లలోను వస్తున్న మార్పులే ఎక్కువగా ఈ కేసులు పెరగడానికి కారణమవుతున్నాయని తెలుస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఈ కేసుల ప్రాబల్యం 16 నుంచి 32 శాతం వరకు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 10 శాతం వరకు ఉంటోంది. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో చాలా ఐటి కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అనుసరించాయి. కొన్ని కంపెనీలు ఈ పద్ధతిని ఇప్పటికీ కొనసాగిస్తున్నాయి.

శరీర కదలికలు లేని నిశ్చల జీవన విధానం, శారీరక వ్యాయామం లేకపోవడం ఒక కారణం కాగా, అధిక కార్బోహైడ్రేట్, మసాలా దినుసులు, కొవ్వు, ఉప్పు అధిక శాతం ఉండే జంక్‌ఫుడ్ ఆరగించడం మరో ప్రధాన కారణమవుతోంది. ఫలితంగా ఎన్‌ఎఎఫ్‌ఎల్‌డి ఫ్యాటీలివర్ కేసులకు ఊతం పెరుగుతోంది. అందువల్ల ప్రాసెస్ చేసిన ఆహారాన్ని, చక్కెర పదార్థాలను పరిమితం చేయాలి. ఎన్‌ఎఫ్‌ఎల్‌డికి మెటబాలిక్ సిండ్రోమ్‌తో బలమైన సంబంధం ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే పలు జీవప్రకియల్లో ఏర్పడే విపరీత పరిణామాల వల్ల కలిగే ఇబ్బందుల సమాహారం. ఈ ఇబ్బందులు దీర్ఘకాలిక జబ్బులైన గుండెపోటు, అధిక రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తాయి.

అయితే ఫ్యాటీలివర్ కేసులు పెరగడానికి ప్రధానంగా పిఎన్‌పిఎల్‌ఎ 3 అనే జన్యువు కీలకపాత్ర పోషిస్తున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిఎన్‌పిఎల్‌ఎ 3 జన్యువు మన శరీరంలో అడిపోన్యూట్రిస్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కొవ్వులో, కాలేయ కణాల్లో ఉండి కొవ్వు ఉత్పత్తి, విచ్ఛిన్నతను నియంత్రించడానికి సహకరిస్తుంది. ఆహారంలోని కొవ్వులను ప్రాసెస్ చేయడానికి, నిల్వ చేయడంలో సాయపడడానికి, నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఈ జన్యువుకు హెపాటోసెల్లర్ కార్పినోమా, స్టీటోసిస్, ఫైబ్రోసిస్ వంటి కాలేయ వ్యాధులతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ జన్యువు పనితీరు కోల్పోతే హైపటోసైట్ (కాలేయ కణాల)లో ట్రైగ్లిజరైడ్ చేరడమే కాక, ఫ్యాటీ లివర్‌కు దారి తీస్తుంది.

సాధారణంగా స్త్రీలలో కాలేయం 7 సెంమీ, పురుషుల్లో 10.5 సెంమీ వరకు పరిమాణం ఉంటుంది. ఫ్యాటీ లివర్ అయితే సాధారణ పరిమాణం కంటే 2 నుంచి 3 సెం.మీ ఎక్కువ ఉంటుంది. ఫ్యాటీ లివర్ రక్తపరీక్షలతో పాటు అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో బయటపడుతుంది. ఉదర భాగంలో కుడివైపు నొప్పి కలిగితే లివర్ సమస్య ఉన్నట్టు భావించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యాటీ లివర్ చికిత్సకు హెపటోప్రొటెక్టివ్ ఏజెంట్లు, మెటబాలిక్ సిండ్రోమ్‌టార్గెట్ చేసే డ్రగ్స్, న్యూట్రాస్యూటికల్స్ వినియోగిస్తారు. ఫ్యాటీ లివర్ చికిత్సను హెపాటిక్ స్టీటోసిస్ చికిత్స అని కూడా పిలుస్తారు. పెరిగిన రక్తలిపిడ్ స్థాయిలను పూర్వస్థితికి తీసుకురావడం, ఇన్సులిన్ సెన్సిటివిటీ సాధారణీకరణ, వంటి వాటిపై ఈ ఫ్యాటీ లివర్ చికిత్స ఆధారపడి ఉంటుంది. 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ఊబకాయం ఉన్న రెండేళ్ల వయసు పిల్లల్లో కూడా ఫ్యాటీలివర్ ప్రాబల్యం కనిపిస్తోంది. ఇలాంటి పిల్లల్లో పొత్తికడుపు అసౌకర్యంగా ఉండడం, అలసట, కండరాల నొప్పి, ఉబ్బరం, యాసిడ్ రిప్లక్స్ (ఉదరంలోని ఆమ్లంపైకి ప్రవహించడం)ఎక్కువగా నిద్రపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఇక స్త్రీలల్లో ఫ్యాటీ లివర్ కేసులు చాలా తక్కువ. అయితే గర్భధారణ సయయంలో హార్మోన్ల మార్పులు, మెనోపాజ్ (రుతుక్రమం ముగింపు) వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ముప్పు కలుగుతుంది. ఈ వ్యాధి పెరుగుతున్నప్పుడు అలసట, ఉదర అసౌకర్యం, కాళ్లు లేదా పొత్తి కడుపులో ద్రవం ఏర్పడటం (ఎడీమా) వంటి లక్షణాలు కనిపిస్తాయి. గర్భం దాల్చిన 20 వారాల తరువాత కాలేయం పని చేయకపోవడం క్లినికల్ పరీక్షల్లో బయటపడుతుంది. వికారంగా ఉండడం, వాంతులు, ఆకలి లేకపోవడం, పొత్తికడుపులో నొప్పి, తలనొప్పి, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మంది రోగులకు అధిక రక్తపోటు, మూత్రంలో ప్రొటీన్ కూడా ఉండవచ్చు. రక్తస్రావం, రక్తలో తక్కువ చక్కెర స్థాయిలు ఇవన్నీ కాలేయ వైఫల్యానికి సూచనలని చెప్పవచ్చు. అందుకనే ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు చేయించుకోవడమే కాక, రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేస్తే కాలేయం పదిలంగా ఉండడానికి వీలవుతుంది.

తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన కిటోజెనిక్ డైట్ వల్ల ఇలాంటి ముప్పు చాలా వరకు తగ్గుతుందని అమెరికాలోని కెంటకీ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. కిటోజెనిక్ డైట్ అంటే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే ఆహారం. వేపుళ్లు, చిరుతిళ్లు, నూనె పదార్థాలు కావు. గింజలు, మాంసాహారం, చేపలు వంటివి కిటోజెనిక్ డైట్ కిందకు వస్తాయి. కార్బోహైడ్రేట్లు 50 గ్రాములు మోతాదుకన్నా తక్కువగా ఉండేలా ఆహారం తీసుకోవాలి. కిటోజెనిక్ ఆహారం వల్ల మెదడు లోని నాళాలు చైతన్యవంతం కావడమే కాక, నరాల క్షీణత కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఇలాంటి డైట్ వల్ల తెలివితేటలు, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాటీ లివర్‌ను నివారించడానికి సరైన పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

– డాక్టర్ బి. రామకృష్ణ-                                                                                                           99599 32323

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News