Sunday, January 19, 2025

అయోధ్యకు వెళ్లినందుకు ఆలిండియా ఇమామ్‌ల సంస్థ చైర్మన్‌పై ఫత్వా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఈ నెల 22న అయోధ్యలో రామ్‌లల్లా ఆలయ ప్రాణ ప్రతిష్ఠకు హాజరయినందుకు తనపై ఫత్వా జారీ చేసినట్లు ఆల్ ఇండియా ఇమామ్ సంస్థ అధ్యక్షుడు ఉమర్ అహ్మద్ ఇలియాసి తెలియజేశారు. మంగళవారం ఆయన పిటిఐ వీడియోతో మాట్లాడుతూ ఆ కార్యక్రమం జరిగిన రోజునుంచి కూడా కొంతమందినుంచి తనకు ఫోన్‌లో బూతులు తిడుతూ బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న ఈ కార్యక్రమానికి దేశం నలు మూలలనుంచి అన్ని మతాలు, వర్గాలకు చెందిన 7 వేల మందికి పైగా ఆహూతులను ఆహ్వానించడం తెలిసిందే సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తనపై ఫత్వా జారీ చేశారని, తన మొబైల్ ఫోన్ నంబర్‌ను దానిలో పేర్కొన్నారని, తనను బహిష్కరించాలని కోరుతూ దాన్ని ఇమామ్‌లు, మసీదు అధికారులందరికీ పంపించారని ఇలియాసి చెప్పారు.

తాను క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని కూడా ఆ ఫత్వాలో కోరినట్లు ఆయన తెలిపారు. ‘ఫత్వా ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందో వాళ్లకు తెలియాలి. రామజన్మ భూమి ట్రస్టు నాకు ఆహ్వానం పంపించింది. దాన్ని నేను అంగీకరించాను. ఆహ్వానం అందిన తర్వాత నేను రెండు రోజలు పాటు ఏం చేయాలని ఆలోచించాను. ఎందుకంటే అది నా జీవితంలోనే అతి పెద్ద నిర్ణయం. అయితే మత సామరస్యం కోసం, దేశం కోసం, జాతీయ ప్రయోజనాల కోసం నేను అయోధ్యకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాను’ అని ఇలియాసి చెప్పారు. అయోధ్య ప్రజలు తనను స్వాగతించారని, సాధువులు,ప్రముఖులు కూడా తన రాకపట్ల సంతోషం వ్యక్తం చేశారన్నారు. ‘ఆలయ ట్రస్టు నా నిర్ణయాన్ని స్వాగతించింది.నేను ప్రేమను పంచడానికి అక్కడికి వెళ్లాను.అది నెరవేరింది. మన ప్రార్థనలు, ఆచారాలు, మతం, కులం, విశ్వాసాలు వేర్వేరు కావచ్చు.

కానీ అతి పెద్ద మతం మానవత్వం. నేను ఎలాంటి తప్పూ చేయలేదు.కాబట్టి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదు.ఇది భిన్నత్వంలో ఏకత్వం కల‘సర్వధర్మ సమభావ్’ భారత్. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం పురోగమిస్తోంది. చంద్రుడిపై భారత్ కాలు మోపింది. విశ్వగురు కావడానికి జరుపుతున్న ప్రయాణంలో మనమంతా ఒక్కటిగా, బలంగా ఉండాలి. ఇది అందరి భారత్, అందుకే ఇది గొప్పదేశం’ అని ఇలియాసి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News