Friday, December 20, 2024

బైడెన్ ఇంట్లో 13 గంటలు సోదాలు

- Advertisement -
- Advertisement -

6 రహస్య ఫైళ్లు స్వాధీనం
అమెరికా అధ్యక్షుడి మెడకు చుట్టుకొంటున్న రహస్య పత్రాల ఉదంతం

వాషింగ్టన్: రహస్య పత్రాల వ్యవహారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మెడకు చుట్టుకొంటోంది. గతంలో ఆయన నివాసాల్లో, కార్యాలయాల్లో జరిపిన సోదిల్లో పలు రహస్య ఫైల్స్ లభించగా, తాజాగా విల్మింగ్టన్‌లోని ఆయన ప్రైవేటు ఇంట్లో జరిపిన మరో సోదాలో ఇంకో ఆరు ఫైళ్లు లభ్యమయ్యాయి. శుక్రవారం ఉదయంనుంచి రాత్రి వరకు సుమారు 13 గంటలపాటు బైడెన్ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు. ఈ ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు అందజేశారు. సోదాలు జరిపే సమయంలో బైడెన్ కాని, ఆయన సతీమణి కానీ ఇంట్లో లేరు.

శుక్రవారం బైడెన్ ఇంట్లో దొరికిన ఫైళ్లలో కొన్ని ఆయన సెనేటర్‌గా ఉన్న సమయంలోనివని అధికారులు గుర్తించారు. మరికొన్ని ఆయన ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలోనివిగా నిర్ధారించారు. సోదాల సమయంలో ఇరు పక్షాలకు చెందిన లీగల్ టీమ్‌లు, వైట్‌హౌస్ అధికారి ఒకరు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. బైడెన్ లివింగ్ రూమ్ మొదలుకొని గ్యారేజ్ దాకా మొత్తం ఇంటినిశోధించారు. ఈ సోదాల్లో ఇంటెలిజన్స్ ఫైల్స్‌తో పాటుగా చేతిరాతతో కూడిన కొన్ని నోట్స్‌ను కూడా లభించినట్లు తెలుస్తోంది. జో బైడెన్ స్వయంగా న్యాయశాఖ అధికారులను పిలిపించి సోదాలు జరిపించారని అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది బాబ్ బోయర్ తెలిపారు. సోదాలు పూర్తయ్యేంతవరకు విషయాన్ని బహిరంగపర్చవద్దని న్యాయశాఖ విజ్ఞప్తి చేసినటుసమాచారం.

కాగా సోదాలకు ఒక రోజు ముందు బైడెన్ మాట్లాడుతూ ఫైళ్లు దొరకడంపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. దీన్ని ప్రతిపక్ష రిపబ్లికన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇది తెలివితక్కువ ప్రకటన అని వారంటున్నారు. గత నవంబర్‌లో బైడెన్ పాత కార్యాలయంలో కీలక పత్రాలను కనుగొనడంతో ఈ వివాదం మొదలైంది. ఆ తర్వాత జస్టిస్ డిపార్ట్‌మెంట్ డిసెంబర్ నెలలో విల్మింగ్టన్‌లోని బైడెన్ ఇంట్లో రెండో బ్యాచ్ పత్రాలను కనుగొనింది. అమెరికా అధ్యక్షుడి ప్రైవేటు కార్యాలయాలు, నివాసాల్లో రహస్య పత్రాలు లభించడంపై దర్యాప్తు చేయడానికి గత వారం అమెరికా అటార్నీ జనరల్ మెరిక్ బి గార్లాండ్ ప్రత్యేక న్యాయవాది రాబర్ట్ హర్‌ను నియమించారు. 2024లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను తిరిగి పోటీ చేస్తానని బైడెన్ ఇప్పటికే స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రహస్య పత్రాల వ్యవహారం ఆయన మెడకు గుదిబండగామారే అవకాశం కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News