హైదరాబాద్: తెలంగాణ నుంచి ముతక(రంగుమారిన) బియ్యాన్ని కొనకూడదని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ) నిర్ణయించుకుంది. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ముతక బియ్యాన్ని అత్యధికంగా పండించే తెలంగాణలో సేద్యపు మార్పిడి తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోంది. తెలంగాణలో రెండు సీజన్‌లలోదాదాపు 1.5 కోట్ల టన్నుల బియ్యాన్ని పండించడం జరుగుతోంది. కనీస మద్దతు ధర కింద అత్యధికంగా 21 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు.
ఇరుగుపొరుగు రాష్ట్రాలైన కర్నాటక,తమిళనాడు, కేరళలో స్థానికంగా ఎక్కువ పండించడం జరుగుతున్నందున తెలంగాణ నుంచి దిగుమతిని తగ్గించుకున్నాయి. దాంతో స్థానికేతర మార్కెట్లలో నమ్మకం తగ్గిపోతోంది. ఇంతేకాక ముతక రకం(రంగుమారిన) బియ్యాన్ని అమ్ముకోవడంలో స్థానిక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక వ్యాపారులు తెలంగాణ కన్నా తక్కువ కనీస మద్దతు ధర ఉన్న ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి బియ్యాన్ని కొంటున్నారు. ఈ కారణంగా మన రైతులు రాష్ట్రం వెలుపల మార్కెట్‌ను కోల్పోతున్నారని అధికారులు తెలిపారు. సేద్యపు మార్పిడి కూడా కష్టసాధ్యమైన పనేనంటూ అధికారులు చెబుతున్నారు.
బియ్యం సేకరణ విషయంలో తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం వ్యవహరిస్తోందని సివిల్ సప్లయ్స్ మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు.‘కేంద్రం యాసంగి కాలంలో పంజాబ్ నుంచి 1.13 కోట్ల మెట్రిక్ టన్నుల బాయ్‌ల్డ్ రైస్‌ను కొనుగోలుచేయగా, తెలంగాణ నుంచి కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలు చేస్తానని చెబుతోంది. తెలంగాణ భారత దేశంలో భాగం కాదా?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఈ వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలోని 55 లక్షల ఎకరాల్లో పాడిని పండించనున్నారని, దాదాపు 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రాగలదని భావిస్తున్నామని, కాగా ఎఫ్‌సిఐ మాత్రం 60 లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే కొనుగోలుచేసేందుకు సంసిద్ధంగా ఉందని, అయితే మిగతా 80 లక్షల మెట్రిక్ టన్నుల గతి ఏమి కాను అని కూడా ఆయన విమర్శించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఈ విషయంలో నచ్చజెపేందుకు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రయత్నించాలని ఆయన కోరారు.