విదేశీ విరాళాల స్వీకరణపై ఆంక్షల తొలగింపు
న్యూఢిల్లీ: కొద్ది రోజుల క్రితం మిషనరీస్ ఆఫ్ చారిటీస్‌కు రద్దు చేసిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఫెరా) లైసెన్సును కేంద్ర హోం మంత్రిత్వశాఖ శనివారం పునరుద్ధరించింది. ఫెరా లైసెన్సును పునరుద్ధరించడంతో కలకత్తాకు చెందిన ప్రముఖ స్వచ్ఛంద సంస్థ మిషనరీస్ ఆఫ్ చారిటీ ఇక నుంచి విదేశీ విరాళాలను స్వీకరించడంతోపాటు బ్యాంకుల్లోని తన డబ్బును వాడుకోవచ్చని హోం శాఖ అధికారి ఒకరు తెలిపారు. పేదలు, అనాథలను ఆదుకోవడానికి నోబెల్ అవార్డు గ్రహీత మదర్ థెరిసా 1950లో మిషనరీస్ ఆఫ్ చారిటీ స్థాపించారు. కొన్ని ప్రతికూల సమాచారం కారణంగా మిషనరీస్ ఆఫ్ చారిటీకి చెందిన ఫెరా లైసెన్సును రద్దు చేస్తున్నట్లు డిసెంబర్ 27న హోం శాఖ ప్రకటించింది. అయితే సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలేవీ స్తంభింపచేయలేదని హోం శాఖ తెలియచేయగా తమ ఖాతాలను స్తంభింపచేయాలని కోరుతూ మిషనరీస్ ఆఫ్ చారిటీ స్వయంగా తమకు లేఖ రాసిందని ఎస్‌బిఐ వెల్లడించింది.