సచిన్ టెండూల్కర్
ముంబై: టీమిండియాతో లార్డ్స్ వేదికగా జరిగిన చారిత్రక మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టులో భయం స్పష్టంగా కనిపించిందని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లను చూసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ వణికి పోయారన్నాడు. వారి కళ్లలో భయం స్పష్టంగా కనిపించిందన్నాడు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించక పోయినా టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్‌లో చెలరేగిన తీరును ఎంత పొగిడినా తక్కువేనన్నాడు. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల ప్రదర్శన భారత టెస్టు చరిత్రలో చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోవడం ఖాయమన్నాడు.
బుమ్రా, షమి, ఇషాంత్, సిరాజ్‌లు అసాధారణ బౌలింగ్‌తో చెలరేగి పోయిన తీరు తనను ఎంతో ఆకట్టుకుందన్నాడు. ఇంగ్లండ్ వంటి బలమైన జట్టును వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించడం గర్వంగా ఉందన్నాడు. ఇలాంటి చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాను సచిన్ ప్రశంసలతో ముంచెత్తాడు. ఒత్తిడిలోనూ బుమ్రా, షమి బ్యాటింగ్ చేసిన తీరు భారత జట్టు ఆత్మవిశ్వాసానికి నిదర్శనమన్నాడు. క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనా వాటిని తట్టుకుని ముందుకు సాగడం అద్భుతమన్నాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన షమి, బుమ్రాలను సచిన్ ప్రశంసించాడు. రానున్న రోజుల్లో కూడా వీరు ఇటు బ్యాట్‌తో అటు బంతితో చెలరేగి పోవాలని సచిన్ ఆకాంక్షించాడు.