వెలుగులోకి సామూహిక సమాధులు
మరణాలు వేల సంఖ్యలో ఉండవచ్చంటున్న ఉక్రెయిన్ అధికారులు
జపోరిజియా( ఉక్రెయిన్): ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగర శివారు పట్టణం బుచా తరహాలో దాదాపు పూర్తిగా తన అధీనంలోకి తెచ్చుకున్న మరియుపోల్ నగరంలో కూడా రష్యా సైన్యం దారుణ ఊచకోతకు పాల్పడిందా? ఈ ఊచకోతలను కప్పిపుచ్చుకోవడానికి అలా చంపేసిన వేలాది మందిని సామూహిక సమాధుల్లో పూడ్చి పెట్టారా? మరియుపోల్‌కు సమీపంలోని సామూహిక సమాధుల తాజా ఉపగ్రహ చిత్రాలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరియుపోల్‌ను స్వాధీనం చేసుకునే క్రమంలో రష్యా సైనికులు దాదాపు 9 వేల మంది పౌరులను చంపేశారని, వారినందరినీ సామూహిక సమాధుల్లో పూడ్చి పెట్టారని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. మరియుపోల్ పోరులో విజయం సాధించామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన కొద్ది గంటల్లో నే ఈ ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి రావడం గమనార్హం. ఉపగ్రహ ఛాయా చిత్రాలను అందించే మాక్సార్ టెక్నాలజీస్ ఈ ఫొటోలను విడుదల చేసింది.
యుద్ధంలో మరణించిన పౌరులను పూడ్చి పెట్టడం కోసం రష్యా సైన్యాలు నగరానికి సమీప పట్టణంమన్‌హుష్‌లో 200కు పైగా సామూహిక సమాధులను తవ్వినట్లు ఆ చిత్రాలద్వారా తెలుస్తోంది. మరియుపోల్ శివార్లలోని మన్‌హుష్ పట్టణంలో ఇప్పుడున్న శ్మశాన వాటికనుంచి మొదలుకొని కొన్ని వందల మీటర్ల దాకా ఈ సామూహిక సమాధులు కనిపిస్తున్నాయి. ఈ సమాధుల్లో దాదాపు 9 మంది దాకా మరణించిన వారిని ఖననం చేసి ఉంటారని మరియుపోల్ సిటీ కౌన్సిల్ అంచనా వేసింది. మరియుపోల్ నగరంలో 20 వేల మందికి పైగానే పౌరులు మరణించి ఉంటారని ఉక్రెయిన్ అధికారులు అంటున్నారు. మరియుపోల్‌లో చంపేసిన వారిని మన్‌హుష్‌కు తీసుకువెళ్లి పూడ్చిపెట్టడం ద్వారా రష్యా సైన్యం తమ మిలిటరీ నేరాలను దాచి పెట్టడానికి ప్రయత్నిసున్నదని నగర మేయర్ వాదిమ్ బోయ్‌చెంకో ఆరోపించారు. రష్యా చర్యలను నాజీల హయాంలో జరిగిన ఊచకోతలతో ఆయన పోల్చారు. మృతదేహాలను ట్రక్కుల్లో కుక్కి తీసుకువచ్చి ఇక్కడ గుంపుగా పూడ్చిపెడుతున్నారని మేయర్ సహాయకుడు పియటర్ ఆంద్య్రుష్‌చెంకో చెప్పారు. అయితే ఈ వార్తలపై క్రెమ్లిన్ ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు. కాగా గత మార్చిచివర్లోనే ఈ సామూహిక సమాధులను తవ్వడం మొదలైందని,ఇటీవలి కాలంలో పెరిగాయని మాక్సార్ ఒక ప్రకటనలో తెలిపింది.