Sunday, December 22, 2024

బిసి విద్యార్థుల పూర్తి ఫీజుల స్కీం పునరుద్ధరించాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఇంజనీరింగ్, మెడిసిన్, పిజి కోర్సులు చదివే బిసి విద్యార్థుల మొత్తం ఫీజు రియింబర్స్ మెంట్ పథకాన్ని పునరుద్దరించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత రెండు సంవత్సరాల ఫీజు బకాయిలు రూ. 5 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్ధులు ఆదివారం బిసి భవన్ లో దీక్షలు చేపట్టారు. రాష్ట్ర బి.సి విద్యార్ధి సంఘం ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ మహా దీక్షల కార్యక్రమంలో బిసి నాయకులు ఆర్. కృష్ణయ్య, ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, అంజి, నీల వెంకటేష్, సతీష్, అనంతయ్య, పి. సుధాకర్, రాజ్ కుమార్, నంద గోపాల్ శంకు యాదవ్, భాస్కర్ ప్రజాపతి, మోడి రాందేవ్, రాకేష్ దత్త తదితరులు పాల్గొన్నారు.

దీక్షకు మద్దతుగా ఓయు కు చెందిన వివిధ విద్యార్ధి నాయకులు సంజయ్, అజయ్, ప్రజిత్ గౌడ్, శాంతి కుమార్, సాయి ఓంకార్ గౌడ్, వంశీ కృష్ణ, నరేష్ గౌడ్, శివ తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఫీజు రియింబర్స్‌మెంట్ పథకాన్ని పునరుద్దరించక పోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వ్యతిరేక ప్రచారం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఫీజు బకాయిలు 5వేల కోట్ల బిల్లులు ట్రెజరీలో పెండింగ్ లో ఉన్నాయని బడ్జెట్ లేక పాస్ కావడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా దివాళా తీసింధన్నారు.

2008లో బిసి సంక్షేమ సంఘం పోరాడి ఫీజు రియింబర్స్‌మెంట్ పథకం పెట్టించినపుడు కాలేజి కోర్సుల మొత్తం ఫీజులను మంజూరు చేసే విధంగా ప్రభుత్వం జి.ఓ. నెం. 18 జారీ చేసిందన్నారు. . 2013 వరకు పూర్తి ఫీజులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబిఎ, ఎంసిఎ, పిజి, డిగ్రీ తదితర కోర్సుల ఫీజులను ఎంత ఉంటే అంత మొత్తం ట్యూషన్ ఫీజులు, స్పెషల్ ఫీజలు ప్రభుత్వం భరించేదని తెలిపారు. 2014లో ప్రభుత్వం పూర్తి ఫీజుల పథకానికి పరిమితులు విదిస్తూ ఇంజినీరింగ్ కు 35 వేలు మాత్రమే మంజూరు చేస్తోందని అన్నారు. చాలా కాలేజీల్లో 35 వేల కంటే ఎక్కువ ఫీజులు ఉన్నాయని, పెంచిన ఫీజులు కట్టలేక బి.సి విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ఎస్‌సి, ఎస్‌టి విద్యార్థులకు పూర్తి ఫీజులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తోందని, మైనారిటీ ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి ఫీజులు మంజూరు చేస్తోందని బిసిలకు పరిమితులు విధించడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ కాలేజీలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. విద్యార్థులను పీల్చి పిప్పి చేస్తూ ఆత్మహత్యలకు దోహధం చేస్తున్న కార్పొరేట్ కాలేజీలను నిషేధించాలన్నారు. బిసి కాలేజీ హాస్టళ్ళకు, గురుకుల పాఠశాలలకు స్వంత భవనాలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు ఆమోదించారు. పెరిగిన ధరల ప్రకారం కాలేజీ హాస్టల్ విద్యార్థుల మెస్ చార్జీలను పెంచాలని, ఈ సంవత్సరం అదనంగా 199 బిసి గురుకులాలు మంజూరు చేయాలని, డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News