Tuesday, January 21, 2025

విమానం నుంచి మహిళా క్యాన్సర్ రోగి బలవంతంగా దించివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మహిళా క్యాన్సర్ రోగిని అమెరికా విమాన సిబ్బంది బలవంతంగా విమానం నుంచి దించివేశారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ సంఘటనపై దర్యాప్తునకు డీజీసీఏ ఆదేశించింది. క్యాన్సర్‌తో బాధపడుతున్న మీనాక్షి సేన్ గుప్తా ఇటీవల సర్జరీ చేయించుకుంది. జనవరి 30 న ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కింది. సర్జరీ వల్ల చేతులతో బరువు మోయలేని స్థితిలో ఆమె ఉన్నది. మీనాక్షి ధరించిన బ్యాగ్ చూసి గ్రౌండ్ సిబ్బంది ఎంతో సహకరించారు. ఆమెను విమానం లోకి ఎక్కించడంతోపాటు హ్యాండ్ బ్యాగ్‌ను ఆమె సీటు వద్ద ఉంచారు. తొలుత విమాన సిబ్బంది కూడా ఆ హ్యాండ్ బ్యాగ్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు.

విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఒక ఎయిర్‌హోస్టెస్ మీనాక్షి వద్దకు వచ్చి ఆ బ్యాగ్‌ను పై అరలో ఉంచాలని చెప్పింది. తన అసహాయతను వ్యక్తం చేసి మీనాక్షి ఆమె సహాయం కోరింది. ఆ బ్యాగ్‌ను పైన ఉన్న అరలో పెట్టేందుకు ఆ ఎయిర్‌హోస్టెస్ నిరాకరించింది. మీనాక్షి ఎంత బ్రతిమాలినా ఆమె ఒప్పుకోలేదు. దీంతో మీనాక్షి విమాన సిబ్బందికి ఫిర్యాదు చేసింది. అయితే చాలా అసౌకర్యంగా అనిపిస్తే విమానం నుంచి దిగిపోవాలని వారు ఖరాఖండీగా చెప్పారు. దీంతో మీనాక్షి విమానం దిగిపోయింది. వీల్‌చైర్ కోరినప్పటికీ వారు ఇవ్వలేదని ఆమె ఆరోపించింది. దీనిపై పౌర విమానయాన శాఖకు, ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మీనాక్షి ఫిర్యాదుపై డీజీసీఎ స్పందించి అమెరికన్ ఎయిర్‌లైన్స్ నుంచి వివరణ కోరింది. విమాన సిబ్బంది సూచనలు పాటించక పోవడంతో ఒక కస్టమర్‌ను విమానం నుంచి దించేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ఆమె టికెట్‌లో కొంతమేర తిరిగి చెల్లించినట్టు పేర్కొంది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News