Monday, January 20, 2025

దళిత స్త్రీ విజయం ‘షానిలబడాలె’

- Advertisement -
- Advertisement -

జూపాక సుభద్ర ‘రాయక్కమాన్యం’ కథా సంపుటి లోని కథ ‘షానిలబడాలె’ బతుకు తోటలో రంగురంగుల పూలు. కంటికి చలువ చేసేలా, సోయగం ఇచ్చేలా, పూజకు సమర్పణమయ్యేలా పూలే పూలు. రంగులు వేరైనా వెదజల్లేది సువాసననే. పూలెట్లానో మనమూ అట్లానే! మనుషులు పంచాల్సింది మానవత్వ పరీమళమే అయి ఉండాలని అని తెలియనిది ఎవరికి? అందరికీ తెలుసు! కానీ అసమానతలలో మానవత చిక్కి, ఎండి, రూపం మారిపోయే వనాంతర దృశ్యాలనే తరచూ చూస్తూ ఉంటాం. ఇది మనిషి చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయిన ఒకానొక గాథ. ఒకానొక వ్యథ! ధనవంతులుబీదలు, విద్యావంతులు విద్యాహీనులు వంటి అంతరాలు ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి . కానీ మనిషికీ మనిషికి మధ్య కుల వ్యవస్థ అనేది ఒక వ్యవస్థ గా కాకుండా అవస్థలా అయ్యి కూర్చుంటే ఇక ఏ సమాజాన్న బాగుచేయగలము? ఏసమాజాన్ని నిలదీయ గలము? కానీ, నిలదీయడమే ఇప్పుడు అవసరమై, సభ్య సమాజాన్ని జూపా క సుభద్ర తన ‘షానిలబడాలె’ కథ ద్వారా నిలదీస్తున్నది.

కథలోకి వెళితే, ఒక పల్లె టూరులో సాంబలక్ష్మి అనే దళిత స్త్రీ, ఎంపిటిసిగా ఎన్నికైన తర్వాత ఆమె మండలాఫీస్ కు వెళ్ళి సంతకం చేసి రావాలి అనే అంశాన్ని ఎత్తుకొని రాసిన కథ ఇది. కథ అనే కంటే దీన్ని జీవితం అంటాను నేను. ఆత్మాభిమానం ఉన్న ఎందరో స్త్రీలు ఈ సాంబలక్ష్మి లో కనిపిస్తారు. సాంబలక్ష్మి మండల్ ఆఫీస్‌కి వెళ్లి సంతకం చేస్తుంది. ఇంటికి వస్తుంది. ఇదే కథాంశం! ఇంతే! ఇందులోనే మనకు కావలసినంత సమాచారం లభిస్తుంది, కావాలసినంత కథ దొరుకుతుంది. సాంబలక్ష్మి భావాలు ఆమెతో ఆమె భర్త మాట్లాడిన విషయాలు, ఊరోళ్ళ అభిప్రాయాలు ఇవే ఈ కథలో వచ్చేవి. ఒక్క రోజులోని కొన్ని గంటల వ్యవధి, కొన్ని సంభాషణలు, ఇదే కథ! కానీ ఇందులోంచి వెతికి పట్టుకోవాల్సిన సామాజిక అంతరాలు కాలానికి అనుగుణంగా కలిగిన సామాజిక చైతన్యం ఇందులో మిళితమై ఉన్నవి. సాంబలక్ష్మి తనకు చదువు రాకున్నా అభిమానం కలది. తన గురించి తనకు తెలుసు.

ఆమె మీద ఆమెకు నమ్మకం ఉంది. కానీ, ఎటొచ్చీ సంతకం పెట్టడానికి ఆఫీస్కు పోవాలంటే ఎట్లా తయారయిపోవాలి అనేది ఆమెను ఇబ్బంది పెట్టింది. కట్టుకుందామంటె చాలా చీరలు లేవు, పెట్టుకుందామంటె సొమ్ములు అసలే లేవు. అటువంటిది అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఆమె భర్త కొమురయ్య, ‘సెవులు బోడగున్నయి ఏమన్నా పెట్టుకోకపోయినా వానే’ అని అనగానే ‘సాంబలక్ష్మికి సర్రున మండుకొచ్చింది’. వెంటనే, ‘నువ్వు చేయించిన గుత్తులు గున్నాలు ఏడున్నయి?’ వెంటనే తన అసహాయతను వెల్లడిస్తుంది. తన భర్త మీద తనకు హక్కు! అంతే! తనలో ఎక్కడో దాగి ఉన్న వ్యథను అలా వెళ్ళగక్కడం చూస్తాం. ‘అబ్బో ఏందే లీడరమ్మ ననుకుంటన్నావే’ అనీ, ‘బాటబొంటి లొల్లి బెట్టుకుంటె ఎవలే మనుకుంటరో.. యింటికి బోయినంక దీని సంగతేందో సూడాలె’, ‘లీడరుగిరి సూపిచ్చుడు మొదలుబెట్టింది’ అని అనుకుంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంట సాంబలక్ష్మిని దాటేసి పోయిండు. ‘అంటూ రాస్తుంది రచయిత్రి ఇక్కడ ఎంతో సహజంగా పురుషాధిక్య సమాజాన్ని చూపించి ఒక ఆలోచనలో పడేస్తుంది. కట్టుబాట్లతోనే స్త్రీలు తమ జీవితాలను వెళ్ళదీస్తుంటారు. మగవాళ్లను ఇలా అర్థం చేసుకోవాలి. రాజకీయాల్లో , ఎన్నికల్లో తమ భార్యను నిలబెట్టి అసలు రాజకీయాలు నెరిపేది భర్తనే! ఆ మాత్రం కూడా ఒప్పుకోలేక సాంబలక్ష్మిని‘ దాటేసి బోయిండని చెప్పడం కథా కథన చాతుర్యం అనవచ్చు. వాస్తవికతకు అతి దగ్గరలో ఉండేలా ఈ పాత్రను చిత్రీకరించడం చూస్తాం. ఈ జీవతాలపట్ల అవగాహన ఉండి ఒక పరిశీలనతో కథలోకి తీసుకువెళ్లడం అనేది ముఖ్యమైన విధానం. రచయిత్రి జూపాక సుభద్ర మూడు అంశాలను ముఖ్యంగా కథ ద్వారా నిరూపించింది

1. ఆత్మాభిమానం ఉండాలి అదే జీవితానికి ప్రధానమని
2. చదువుకోవాలి తమ వర్గీయులు అంతా అజ్ఞానం నుండి బయటపడాలని
3. ఈ జాతిలో ఉండే వారి కష్టాలను లోకానికి తెలియజేయడమని. ఇవి ప్రధాన మైనవి.
దీనికి జూపాక సుభద్ర ఎంచుకున్న మార్గం పరోక్ష విధానం. ఈ పరోక్ష విధానం కథా కథనంలోకి తీసుకు వెళ్లేప్పుడు పాఠకుల హృదయానికి ఏదో ఒక సందేశాన్ని తప్పకుండా అందిస్తుంది. ఒక వ్యూహాన్ని పన్నుకొని స్ట్రాటజీ గా, వ్యూహాత్మకంగా మరో వేరే పరిణామం లేని విధంగా ‘గెలవాలి’ అనే ఒక ఉద్దేశంతో వ్రాసినటువంటి కథ ఇది. దీంట్లో ఊహలకు తావులేదు. అన్నీ సత్యాలే. ఎందుకు దళితులు అణగారిపోయి ఉన్నారు, అట్టడుగు దిగువ తరగతిలో ఉన్నారు అనేది చెప్పకుండానే చెప్పింది రచయిత్రి. ఇవి రాసేటప్పుడు రచయిత అనేవారికి కాల్పనిక సాహిత్యం రాసినట్టు కాదు. జీవితాలను రాయడం.

ఈ కథలో అస్పృశ్యత అనే ప్రస్తావననే తేలేదు. రచయిత్రి చెప్పదలుచుకోలేదు.అంతర్లీనంగా ఉన్న విషయం అసమానత. అవిద్యకు అణచివేతకు ద్వారాలు తెరిచిన చరిత్ర కళ్ళముందు తప్పక ఆడుతుంది. తప్పిదాలు ఏమయి ఉంటాయి అని వెతుక్కుంటే గతం మొత్తం గుండెల్లో తారాడుతుంది. ఒక కారణం అనేది లేని విషయం . అన్ని వర్గీయులు ఇందులో భాగస్వాములయ్యారు అనేది లోకానికి తెలిసిన నిజం. ‘మాకు ఎనక ఏడు తరాలు ముందట మూడు తరాలు లేవు చదువుకోకపోతిమి’ ఇది జూపాక చెప్పాలనుకున్న విషయం తరతరాలుగా చదువుకు దూరమైన మనుషులు వీళ్ళు ఇట్లా ఉండకుంటే ఎట్లుంటారు? అనే విషయాన్ని స్ఫరించేలా రాస్తుంది.

ఇక స్త్రీ సమస్యలను చిత్రించేపుడు స్త్రీపురుష సంబంధాలలో, సాంఘిక దురాచారాలలో అస్తిత్వ వాదాలు వర్గ దృష్టితో చూడకూడదు. పితృస్వామ్య వ్యవస్థ అని చెప్పకుండానే ఒక వాక్యంలో చెప్పగలిగింది రచయిత్రి. దళిత జీవితాలలో సాంస్కృతిక జీవనం చల్లగా విచ్చుకొని విస్తరించే పాట వంటిది ఏం కాదు! హార్దికాంశాలు సామాజిక అంశంగా శాసిస్తున్న తీరు ఇందులో కనిపిస్తుంది . నిత్య జీవితానికి ఆర్థిక అంశం అనేది ఆ కుటుంబ ఆ జాతి ఆ వర్గ విధానాలపై దృష్టి ని సారించినప్పుడు వారివారి నైతిక స్థాయిని చూపిస్తాయి. ‘ఎన్నికలు’ అనేది ప్రధానాంశమైనా, చాలా రాజకీయ అంశాలు ఉన్నాయి ఈ కథలో! ఇవ్వాళ సమాజాన్ని శాసిస్తున్నవి రెండే రెండు అంశాలు 1.ఆర్థిక అంశం, 2. రాజకీయ అంశం. తమ సామాజిక వర్గంలోని వాళ్లు ముందడుగు వేయాలి రాజకీయంగా ఎదగాలి అనే స్పృహ తో రాసిన కథ ఇది . అందులోను ముఖ్యంగా స్త్రీలు కూడా రాజకీయంలో ఉండాలి పాలనా విభాగం లో పాత్ర వహించాలి అనే అభిప్రాయంతో కథ నడుస్తుంది. ఎంపీటీసీగా ఎన్నికైన ఒక చదువుకోని ధనం లేని వేరే ఏ బలగాలు బలాలు లేని ఒక సాధారణ స్త్రీని రాజకీయ నాయకురాలిగా చూపించడం అనేది ఒక అడుగు ముందుకు వేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది.

సాంబలక్ష్మి మండల్ ఆఫీస్‌కు ఎట్లా పోవాలి అని తనలో తను విచారణ చేసుకున్నప్పుడు ‘ఏందో .. చార్జి తీసుకోవాలట! సావిత్రమ్మ దొరసాని పోయినట్లు పోవాలి’అని అనుకుంటుంది. తయారయి పోవాలి ఎట్లా పోవాలి ఆమె మనసులో అనేక ప్రశ్నలు అనుమానాలు. ‘సింగులీరబోసి సీరగట్టుకోవాల్నా?’ అనుకుంటుంది. అలవాటు లేని సాంబలక్ష్మికి ఎంతమంది ఎట్ల నవ్వుతారోనని భయం, అభిమానం.‘ సింగులీరబోస్తే నడమంత్రపు సిరి అంటరు, గోసిబెడ్తే ‘లందతోల్లు తినే జాతికి నెయ్యన్నం ఏం రుసి‘ అని మాట్లాడ్తరు . ఏం జెయ్యాలె వుండె తీరుంట , గియ్యాల గీలీడ్నన్నని గీ పెగ్గెలెందుకు ‘అని మనసు కుదుటజేసుకొని సీరెను గోసిబెట్టుకున్నది. అంటూ ఎంతో సహజ సిద్ధంగా రాస్తుంది రచయిత్రి. అందుకే సాంబలక్ష్మి తన నిర్ణయం తానే తీసుకుంటుంది.‘గోసేపెట్టుకుంట తియ్యి ఏదైతే అదయితది‘ అనుకుంటుంది. అని అనుకుంటుంది. తయారయి పోవాలి ఎట్లా పోవాలి ఆమె మనసులో అనేక ప్రశ్నలు అనుమానాలు. ‘సింగులీరబోసి సీరగట్టుకోవాల్నా?’ అనుకుంటుంది. అలవాటు లేని సాంబలక్ష్మికి ఎంతమంది ఎట్ల నవ్వుతారోనని భయం, అభిమానం. ఏం జెయ్యాలె వుండె తీరుంట, గియ్యాల గీలీడ్నన్నని గీ పెగ్గెలెందుకు ‘అని మనసు కుదుటజేసుకొని సీరెను గోసిబెట్టుకున్నది. అంటూ ఎంతో సహజ సిద్ధంగా రాస్తుంది రచయిత్రి. మనుషుల్లో ఉన్న అసమానతలకు ఎవరు బాధ్యులు ఎప్పటినుండి బాధ్యులు అనేవాటి జోలికి పోలేదు రచయిత్రి .వాటిలోని విషయాలు తెలుసు కానీ ఇప్పుడున్న సమాజానికి ఆపాదించలేదు ,ఎందుకంటే ఎప్పుడో చేసినవి ఇవన్నీ, తన చుట్టూ ఇప్పుడు ఉన్న వారందరూ ఇవ్వాళ చేయలేదు కదా అనే వివేచన ఇది. అన్యాయాలను ఇండైరెక్ట్ మెథడ్స్‌లో చెప్పడం అనేది కథా రచనా శిల్పం వైచిత్రి.

గోచిగట్టుకోనే వెళ్ళాలి అని నిర్ణయించుకున్న తర్వాత మరో అనుమానం వచ్చింది సాంబలక్ష్మికి! ‘జెడేసుకోనా? సిగేసుకోనా?‘ అని! ఈ అనుమానం వచ్చాక తనకుతానే సర్దిచెప్పుకుంటూ, గోసిబోసుకున్నంక యింక ఏం జెడేసుకుంట? సిగనే ముడుసుకుంట ‘అనుకొని అట్లే సిద్ధం అవుతుంది. ఇంత సహజంగా తన కథానాయిక పాత్ర ను తీర్చిదిద్దింది రచయిత్రి. స్త్రీలను కించపరచడం అనేది అన్నిచోట్ల చూస్తున్నదే! ఆమె సుఖ దుఃఖాలు చిత్రించేపుడు దుఖః జాడలు వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత రచయితల పైన ఉంటుంది. కట్టుబొట్టు ఆహార్యాలతో స్థాయి రాదు. ఈ విషయాలన్నీ సాంబ లక్ష్మి పాత్ర ద్వారా తన కొడుకుకు చెప్పేటప్పుడు కల్పింప చేసింది రచయిత్రి. సాంస్కృతిక అనుభవాలు కాదు సామాజిక అనుభవాలు ఇందులో కనిపిస్తాయి మానవీయ సంబంధాలు కనిపిస్తాయి బేధాలు కూడా కనిపిస్తాయి. జనాదరణ పొందే లాగ సారూప్యమైన ఆలోచనలు కలిగేలాగా కథను రాయాలి. మనిషి నుండి మనిషికి సమాజ స్థితిగతులను చేరవేయడానికి కథ ఒక గొప్ప వారధి అవుతుంది. రాతి యుగాల కాలం నుండి ఇప్పటివరకు కథ మనసును ఆకట్టుకునే సాధనం.

అయితే కథలోని భావము దిశా నిర్దేశనం చేసేలా ఉండాలి. పాఠకుడిని తనను తాను దిద్దుబాటు చేసుకునేలా ఉండాలి. ఏదో సందేశాన్ని ఇస్తున్నట్టుగా కాదు మనసుకు హద్దుకునేలా ఆలోచింపచేసేలా ఉండాలి. జూపాక సుభద్ర తన రచనలతో తన సమాజాన్ని మేల్కొలిపే ఉద్దేశంతో ఉన్న రచయిత్రి. లింగ, వర్గ జాతి స్థాయీ భేదాలు తెలిసేలా రాయాలనుకునేప్పుడు మాండలికాలను కథకు వికారం కలిగించకుండా ఉండాలి. పార్టోళ్ళను ఏం నమ్ముతం అనుకుంటూ సాంబలక్ష్మి తన భర్తతో ‘నాదానుజేత్తరని డౌటొత్తందే’ అంటుంది. ఎంత సహజంగా తీర్చిదిద్దింది రచయిత్రి! సాంబలకి తన సామర్థ్యం తనకు తెలుసు. అందుకే అట్లా అనుమానం వ్యక్తం చేస్తుంది.

సాధారణంగా కాల్పనికత వాస్తవికత అనే రెండింటిని నైపుణ్యంతో ప్రదర్శించాలి. సునిశితమైన పరిశీలనతో రాసిన కథ విశాల దృష్టితో ఆలోచింపచేసేలా చేస్తుంది. సంభాషణ సారథ్యం కథకు బలాన్ని ఇస్తుంది. పాత్ర మాట్లాడుతుంది అంటే పాఠకులతో మాట్లాడుతున్నట్టే !పాఠకులు తొందరగా ఆకర్షితులవుతారు. Plot element ఏమిటి? అనేది తెలియాలి. అంటే కథను తీసుకునేది ఎంతవరకు? కథలో పాఠకుడు ఇన్వాల్వ్ అవ్వాలి. సాంబలక్ష్మి కొడుకును లేపి ‘సదువుకోరా’ అంటుంది. వీళ్ళ మాటలు విన్నాడుకదా వెంట వస్తానంటాడు. వెంటనే ‘వద్దురా నాగ లేకుండ బోతనే సదువత్తదిరా!/లేకుంటే మా తీరే నువ్వయితవు కొడుకా’ అంటుంది. కథకు ముడిసరుకు జీవితమే!/ కథా శిల్పం దెబ్బతినకుండా రాయడం ఒక కళ!/ తను చెప్పాలకున్న సందేశం ఇదే!/ బాగా చదువుకోవాలి!!/ చదువుకోలేక పోవడం వల్లనే తాము వెనకబడ్డామని ఒక తెలివిడి ని తెప్పించే ప్రథానోద్దేశ్యమిది.

సాంబలక్ష్మి ఆఫీసుకు వెళుతుంది. అక్కడ వూరిదొర ‘మీ ప్రెసిడెంటు నమస్తె బెట్రుండ’ ని కారెడ్డంగా చెప్పడమూ, వాళ్ళెవ్వరూ నమస్తే పెట్టకపోవడం తో తలకొట్టేసినట్లైంది. ఎమ్మార్వో ఎండిఓ క్లర్కులు పాత దొడ్డు పుస్తకాలు ముందరబెట్టగానే తను నేర్చుకున్న సంతకమొక్కటి చేసేస్తుంది సాంబలక్ష్మి. వాళ్ళందరి మధ్యన తానో దిష్టి బొమ్మలా కనిపించనట్లనుకొని, కాసేపుండి ఇంటికివచ్చి తాళం దీసి ఎత్తేస్తుంది. ‘నల్లమొకపోడ…’ అంటూ భర్తను అంటూ ‘రాజకీయమని తోల్తివి… కచ్చీర్లక్కుతం అంటే ఎట్లుంటది?’ ఓ ఆయిమన్న సీరె లేదాయె పెయిమీద గింత సొమ్ములేదాయె కోపంతో శోకాలు అందుకున్నది. అంటూ దృశ్యీకరిస్తుంది రచయిత్రి. ఆమె విసిరిన చీర, సవురాన్ని తీసుకుంటూ, నారాజు పడితె లీడరెట్లైతవే అనుకుంటూ ‘యీకాన్నుంచి సింగులీరబోసి సదువుకున్నామె లెక్క దొర్సానోలె బోవాలె. ప్రసిడెంటా మజాకా.. అని ఎత్తేసిన వస్తువులన్నీ సదురుకుంటన్నడు సాంబలక్ష్మిపెనిమిటి అని కథను ముగిస్తుంది రచయిత్రి.

ఈ ముగింపుతో కొత్త రూపురేఖలు ఆశించే విషయం అర్థం అవుతుంది. కళ( art), కౌశలం ( క్రాఫ్ట్) కళాకారుడి భావానికి ఆకట్టుకునే రూపం ఇచ్చేదే నైపుణ్యం. ఈ నైపుణ్యం కన్పిస్తుంది ఈ కథలో!/ జీవితానికి కుటుంబ నేపథ్యం చాలా ప్రాముఖ్యతనిస్తుందని సూచించడమైనా, ఇకనైనా అందరూ సక్రమంగా చదువుకోవాలని చెప్పడమైనా, ఏర్పడకుండా నే భర్త భార్యపై పెత్తనం చేస్తాడని ఎత్తిచూపడమైనా, రాజకీయాల్లో స్త్రీలు ఎందరున్నారు అనే ప్రశ్న ను రేకెత్తించడంలో నైనా ఈ కథలో కనిపించే జీవన సూత్రాలు. తన వర్గం స్త్రీల విషయంలో చిత్తశుద్ధి ఉన్నది. పురుషాధిక్య సమాజాన్ని చూపి, స్త్రీ వాద అస్తిత్వ స్పృహరగిలించి వదిలేసింది. భాష విషయం లో నూ జాగ్రత్తగా అడుదేసింది. ఇట్లా , కథ ఎత్తుగడ నుండి ముగింపు వరకు శిల్పం దెబ్బతినకుండా రాయడం చూస్తాం. Contest గమనిస్తే దళిత సాహిత్యం లో నిలిచి పోయే కథ ‘షానిలబడాలె’. రాజకీయ స్పర్ష, టచ్‌తో రాసిన కథ ఈ కథ. రచయిత్రి జూపాక సుభద్రకు అభినందనలు.\

డా॥కొండపల్లి నీహారిణి 98663 60082

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News