వరంగల్ జిల్లా కేంద్రంలోని ములుగు రోడ్డు, పైడిపల్లి పరిధిలో గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలో వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. శివరాత్రి పర్వదినం రోజున జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది. విద్యార్థిని హాస్టల్ గదిలో ఫ్యాన్‌తో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం చోటు చేసుకుంది. అగ్రికల్చర్ బిఎస్‌సి మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత స్వస్థలం నల్గొండ. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్న
వ్యవసాయ కళాశాలలో కొంత కాలంగా ర్యాగింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం ఆ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడటం గమనార్హం. మరోపక్క ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలు కూడా కారణమని తెలుస్తోంది. తోటి విద్యార్థుల సమాచారం మేరకు ఏనుమాముల సిఐ రాఘవేందర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.