Wednesday, January 22, 2025

లైంగికంగా వేధిస్తున్నారు..చనిపోయేందుకు అనుమతి ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తి అంటే సహజంగానే ప్రత్యేక గౌరవం, భయభక్తులు ఉంటాయి. అలాంటి న్యాయమూర్తికే పని ప్రదేశంలో అత్యంత అవమానకర పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో సదరు మహిళా న్యాయమూర్తి ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధమయినట్లు కథనాలు వెలువడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా న్యాయమూర్తికి పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి.తనతో పని చేస్తున్న కొందరు సీనియర్లు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బహిరంగ లేఖ రాశారు.దీంతో ఈ ఘటనపై తక్షణమే నివేదిక ఇవ్వాలని సిజెఐ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్‌లోని బంకా జిల్లాలో విధులు నిర్వహిస్తున్న మహిళా సివిల్ జడ్జి రాసిన ఈ లేఖ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘ సామాన్య ప్రజలకు న్యాయం న్యాయవృత్తిలో చేరిన నేను .. ఇప్పుడు అదే న్యాయం కోసం ప్రతి తలుపును తట్టాల్సి వస్తోంది.గత కొన్ని నెలలుగా జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు నాపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. నన్ను పురుగుకంటే హీనంగా చూస్తున్నారు.

రాత్రిపూట న్యాయమూర్తిని ఒంటరిగా కలవాలని ఆదేశిస్తున్నారు’ అని ఆ మహిళా జడ్జి తన లేఖలో పేర్కొన్నారు. ‘దీనిగురించి ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లాను. అయినా ప్రయోజనం లేదు. ఈ కేసులో సాక్షులు ఆ జిల్లా న్యాయమూర్తి కింద పని చేసే వారే.తమ బాస్‌కు వ్యతిరేకంగా వారు సాక్షం చెప్పగలరని నేను ఎలా నమ్మగలను? అందుకే దర్యాప్తు పూర్తయ్యే వరకు సదరు జడ్జిని బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశా. కానీ కొన్ని సెకన్ల వ్యవధిలో నా అభ్యర్థనను కొట్టివేశారు. గత ఏడాదిన్నరగా నేనో జీవచ్ఛవంలా బతుకుతున్నా. నేను బతికుండి ప్రయోజనం లేదు.గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతివ్వండి’ అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఈ లేఖ తన దృష్టికి రావడంతో సిజెఐ జస్టిస్ డివై చంద్రచూడ్ చర్యలు చేపట్టారు. దీనిపై తక్షణమే తనకు నివేదిక కావాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అతుల్ కుర్హేకర్‌ను ఆదేశించారు. దీంతో ఆ మహిళా న్యాయమూర్తి ఫిర్యాదు,దానిపై విచారణకు సంబంధించిన మొత్తం వివరాలను సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు కుర్హేకర్ లేఖ రాశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News