మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యంపై కమిటీ నివేదిక
న్యూఢిల్లీ: తగినంతమంది భద్రతా సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ విధులను నిర్వర్తించడంలో ఫిరోజ్‌పూర్ ఎస్‌ఎస్‌పి అవనీత్ హంస్ విఫలమయ్యారని ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన సందర్భంగా తలెత్తిన భద్రతా వైఫల్యంపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నియమిత కమిటీ స్పష్టం చేసింది. ప్రధానమంత్రి భద్రతా విధులలో పాల్గొనే పోలీసు అధికారులకు ఎప్పటికప్పుడు పునశ్చరణ తరగతులు నిర్వహించడంతోపాటు ఎస్‌పిజికి చెందిన బ్లూబుక్‌ను సమీక్షించడం, అవసరమైన విధంగా మార్పులు చేర్పులు చేయడంపై పర్యవేక్షణ కోసం ఒక కమిటీ ఉండాలని సుప్రీంకోర్టుకు గురువారం కమిటీ సూచించింది. ప్రధాని మోడీ ప్రత్యామ్నాయ మార్గంలో ప్రయాణించనున్నారని అప్పటి పంజాబ్ ఎడిజిపి జి నాగేశ్వరరావు ముందుగానే సమాచారం అందచేసినప్పటికీ ఎస్‌ఎస్‌పి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఐదుగురు సభ్యుల కమిటీ సుప్రీంకోర్టుకు వివరించింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్ర నేతృత్వంలోని కమిటీ నివేదికను తగిన చర్యల కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని సుప్రీంకోర్టు తెలిపింది.