హైదరాబాద్: చీఫ్ ఆఫ్ డిఫెన్స్‌స్ఠాఫ్(సిడిఎస్) బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ కూలిన ఘటనపై దర్యాప్తు పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని ఎయిర్‌చీఫ్ మార్షల్ వివేక్‌రామ్ చౌదరి తెలిపారు. హెలికాప్టర్ కూలిన ఘటనపై కోర్టు ఆఫ్ ఎంక్వైరీ పేరుతో ఉన్నతస్థాయి దర్యాప్తునకు భారత వైమానిక దళం(ఐఎఎఫ్) ఆదేశించిన విషయం తెలిసిందే. ఎయిర్‌మార్షల్ మానవేంద్రసింగ్ నేతృత్వంలోని మూడు విభాగాలకు చెందిన సీనియర్ అధికారులు హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తు జరుపుతున్నారు. హైదరాబాద్‌లోని దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో శనివారం నిర్వహించిన పాసింగ్ ఔట్ పరేడ్‌కు వాయుసేనాధిపతి(ఐఎఎఫ్ చీఫ్) చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ ప్రమాదంపై దర్యాప్తునకు సంబంధించి మీడియాకు వివరించారు.
వాతావరణంలో మార్పు వల్లనా..? మానవ తప్పిదమా..? సాంకేతిక లోపమా..? అనే అంశాలపై దర్యాప్తు సాగుతున్నదని ఆయన తెలిపారు. ఘటనా స్థలంలో దొరికిన ప్రతి ఆధారాన్నీ నిశితంగా పరిశీలించి ప్రమాద కారణాలను దర్యాప్తు ద్వారా తేల్చనున్నారని చౌదరి తెలిపారు. ఈ ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరుగుతుందని, అందువల్ల ఇప్పుడే దీనిపై ఏమీ మాట్లాడలేనని ఆయన అన్నారు. ఈ నెల 8న తమిళనాడులోని కూనూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యసహా 14మంది మృతి చెందిన విషయం తెలిసిందే.