Monday, December 23, 2024

వరాల వర్షం

- Advertisement -
- Advertisement -

Field assistants back into duties

నిపుణుల నివేదిక రాగానే జీవో 111 ఎత్తివేస్తాం

తిరిగి విధుల్లోకి ఫీల్డ్ అసిస్టెంట్లు సెర్ప్, మెప్మా
సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు విఆర్‌ఎలకు ఇరిగేషన్‌లో లష్కర్ పోస్టులు మధ్యాహ్న భోజన నిర్వాహకులకు గౌరవ వేతనం రూ.3వేలు నెలాఖరులోగా 40 వేల కుటుంబాలకు దళితబంధు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వైద్య విద్యార్థులను చదివిస్తాం : శాసనసభలో సిఎం కెసిఆర్

మనతెలంగాణ/ హైదరాబాద్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో పని చేస్తున్న పలువురు ఉద్యోగులకు ముఖ్యమంత్రి కల్వకుంట్లు చంద్రశేఖర్‌రావు వరాలు కురిపించారు. మంగళవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బడ్జెట్ పద్దులపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ పలు అంశాలపై సభ్యులకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చారు. విధుల్లోకి తీసుకోవాలంటూ చాలా కాలంగా ఆందోళన చేస్తున్న ఫీల్డ్ అస్టిసెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని సెర్ఫ్, మెప్మా విజ్ఞఫ్తులపై, విఆర్‌ఎలకు పేస్కేల్ వర్తింపు, మధ్యాహ్న భోజన నిర్వహకుల గౌరవ వేతనాల పెంపు అంశాలపై ముఖ్యమంత్రి శుభవార్తలు చెప్పారు. ఎంత ఖర్చయినా వెచ్చించి ఉక్రెయిన్‌లో మెడిసిన్ చదివేందుకు వెళ్లి తిరిగి వచ్చిన విద్యార్థులందరినీ చదివిస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. 20వేలకుపైగా భారతీయలు ఉక్రెయిన్లో చిక్కుకొని పోయారు. వీళ్లంతా మెడిసన్ చదువుకునేందుకు ఉక్రెయిన్ వెళ్లారు. మన రాష్ట్రం నుంచి 740 మంది పిల్లలు వెళ్లారు. వారిని రాష్ట్రానికి తెప్పించేందుకు ఢిల్లీ రెసిడెంట్ కమిషనర్తో మాట్లాడాం. ఇందులో మన రాష్ట్రానికి చెందిన 700 మంది ఎంబిబిఎస్ చదువుకునేందుకు వెళ్లారు.

అక్కడ రూ.25 లక్షల్లో అయితే.. ఇక్కడ రూ.కోటి అడుగుతున్నరు. పేద పిల్లలు భరించలేనోళ్లు అక్కడన్న చదువుకుందామని వెళ్లారు. ఇందుకు పోయారం? ఇక్కడ దిక్కులేక పోయారు. అవకాశం లేక పోయారు.. ఏం చేయాలి. ఉక్రెయిన్లో యుద్ధం ఇంకా సమసిపోలేదు.. ఏమైతదో తెలియదు. కిందపడి మీద పడి 700 మంది పిల్లలను టికెట్లు భరించి వాపస్ తీసుకువచ్చాం. ఇప్పుడు వాళ్ల భవిష్యత్ ఏంటి? డిస్ కంటిన్యూ కావాలా? తిరిగి ఉక్రెయిన్ వెళ్లే పరిస్థితులు ఉన్నాయా? ఏం జరగాలి? తెలంగాణ ప్రభుత్వంగా ప్రకటిస్తున్నా.. వెంటనే భారత ప్రభుత్వానికి రాస్తాం వెంటనే. వాళ్ల చదువులకు ఎంత ఖర్చయినా మేం భరించి ఇక్కడ చదివిపిస్తాం. వారి భవిష్యత్ దెబ్బతినకుండా చూస్తాం. ఈ సందర్భంగా వెంటనే కేంద్రానికి లేఖ రాయాలని సిఎస్ ను, మంత్రిని ఆదేశించారు. రాష్ట్రంలోని ఫీల్ అసిస్టెంట్లు, సెర్ఫ్, ఐకెపి మెప్మా ఉద్యోగులకు ముఖ్యమంత్రి కెసిఆర్ శుభవార్త చెప్పారు.

శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెర్ఫ్‌లో 4,500 మంది పనిచేస్తున్నారు. సెర్ఫ్ సొసైటీ.. ప్రభుత్వ ఉద్యోగులు కాదు. అయినప్పటికీ మహిళా సంఘాలను చైతన్యం చేసేందుకు, ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచేందుకు విశేష కృషి చేస్తున్నారు. మంచి ఫలితాలు వస్తున్నాయి. సెర్ఫ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం. ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉపాధిహామీలో పనిచేస్తారు. వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఓ భ్రమలో సమ్మెకు వెళ్లారు. సమ్మె వద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత శాఖ అధికారులు చెప్పినా వినకుండా వెళ్లారు. ఇప్పుడు తప్పయిందని అక్కడికి ఇక్కడి తిరుగుతున్నారు. వాళ్లపై మాకేం కోపం లేదు. ఆ అవసరం లేదు. వారికి పెద్దన్నలా హెచ్చరిస్తున్నా.. ఇకపై పొరపాట్లు పునరావృతం చేయొద్దు. మానవతా దృక్పథంతో తీసుకుంటాం. మళ్లీ ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం. వాళ్లు పొరపాటు చేశారు.. పెద్ద మనసుతో వాళ్లను క్షమించాలని ఎమ్మెల్యేలు కోరుతున్నారు. ఇకపై మళ్లీ ఆ తప్పుమని చేయమని వారు చెప్పారు. అందరి మాటనే నా మాట.. వారందరిని విధుల్లోకి తిరిగి తీసుకుంటాం’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మెప్మా ఉద్యోగులకు సైతం ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అన్నారు. వాళ్లను సైతం పరిగణలోకి తీసుకుంటామన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల మంత్రులు ఆర్థిక మంత్రితో కలిసి లెక్కలు తేల్చి, అందరికీ న్యాయం చేస్తాం’ అన్నారు.

నెలాఖరు నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు

మార్చి 31 నాటికి 40 వేల కుటుంబాలకు దళితబంధు పథకాన్ని అందిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఇప్పటి నుంచి సంవత్సరానికి రెండు లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వబోతున్నట్లు సభలో కెసిఆర్ ప్రకటించారు. దళితులను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. బ్యాంకు నుంచి నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి డబ్బులు జమ అవుతాయని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ఈ పథకం విజయవంతమయ్యేలా చూడాలని కోరారు. లబ్ధిదారుల ఆదుకునేందుకు వీలుగా ఏర్పాటు చేసిన ‘దళిత రక్షణ నిధి’ లో 4 వేల కోట్లు జమ అవుతాయని, ప్రతి నియోజకవర్గానికి దాదాపు రూ.40 కోట్లు అందుబాటులో ఉంటాయని వీటి పర్యవేక్షణను ఎమ్మెల్యేలు తీసుకోవాలని సిఎం సూచించారు.

లష్కర్ పోస్టుల్లో విఆర్‌ఎలు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తయినందున్న వాటి నిర్వహణకు ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడించారు. విఆర్‌ఎలను సాగునీటి పారుదల విభాగంలోకి తీసుకుంటాం, వారికి స్కేల్ ఇచ్చి లష్కర్ పోస్టులోకి తీసుకుంటాం. కాలువల నిర్వహణ కోసం లష్కర్లు పనిచేస్తారు. విఆర్‌ఎలలో చాలామంది విద్యాధికులు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రమోషన్ కోసం చూస్తున్నారు. అలాగే ఎస్‌సి,ఎస్‌టి ఉద్యోగుల పదోన్నతుల విషయంలో వెంటనే పరిష్కారం చూపుతాం.

నిపుణుల కమిటీ నివేదిక రాగానే జీవో నం.111ను ఎత్తివేస్తాం..

భవిష్యత్తులో హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. నగరానికి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాలు అవసరం లేదని.. గోదావరి, కృష్ణా జలాలే పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదిక రాగనే జీవో నం.111ను ఎత్తివేస్తామని వెల్లడించారు. 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో 1,32,600 ఎకరాల భూమి జీవో 111 పరిధిలో ఉందని చెప్పారు. మరోవైపు దేవరాయాంజల్ భూముల్లో ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని తెలిపారు. 111 జీవో అర్ధ రహితం.. ఈ జీవోను ఎత్తేస్తామని పేర్కొన్నారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ లేక్‌లు కలుషితం కాకుండా అప్పట్లో ఈ జీవో పెట్టారు. ఇప్పుడు అసలు ఆ నీళ్లే వాడటం లేదు. మరో వంద సంవత్సరాల వరకు హైదరాబాద్‌కు తాగునీటి సమస్య రాదు. నిపుణుల కమిటీ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఆ నివేదిక రాగానే గ్రీన్ జోన్, మాస్టర్ ప్లాన్ అమలు చేస్తూ 111 జీవోను ఎత్తివేస్తాం’ అని సిఎం తెలిపారు.

మధ్యాహ్న భోజన నిర్వాహకులకు నెలకు రూ. 3వేలు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వాహకులు 54201 మంది ఉన్నారని, ఇప్పటి వరకు వారికి నెలకు గౌరవ వేతనంగా వేయి రూపాయలు అందజేస్తున్నామని.. విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి సూచనతో వారికి నెలకు రూ.3 వేలు అందజేస్తామని సిఎం కెసిఆర్ ప్రకటించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News