Monday, December 23, 2024

ఫుట్‌బాల్ ప్రపంచకప్: సౌదీపై పోలండ్ విజయం

- Advertisement -
- Advertisement -

దోహా: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ గ్రూప్‌సిలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పోలండ్ 2-0 గోల్స్ తేడాతో సౌదీ అరేబియాను ఓడించింది. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా వంటి బలమైన జట్టును మట్టికరిపించిన సౌదీ అరేబియా ఈసారి మాత్రం పోలండ్‌పై అలాంటి ప్రదర్శన చేయలేక పోయింది. మరోవైపు పోలండ్ అద్భుత ఆటతో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. మెక్సికోతో జరిగిన తొలి మ్యాచ్‌ను పోలండ్ డ్రాగా ముగించింది. ఈ మ్యాచ్‌లో మాత్రం పోలండ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. వరుస దాడులతో సౌదీ అరేబియాను ఉక్కిరిబిక్కిరి చేసింది. సౌదీ కూడా ఎటాకింగ్ గేమ్‌తో అలరించింది. ఇరు జట్లు కూడా సర్వం ఒడ్డడంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది.

ఆట 39వ నిమిషంలో పోలండ్ నిరీక్షణ ఫలించింది. పియోటర్ జిలిన్‌స్కి ఈ గోల్‌ను సాధించాడు. దీంతో ప్రథమార్ధంలో పోలండ్ 10 ఆధిక్యంలో నిలిచింది. రెండో అర్ధ భాగంలో కూడా పోరు నువ్వానేనా అన్నట్టుగానే సాగింది. ఇటు పోలండ్ అటు సౌదీ గోల్స్ కోసం సర్వం ఒడ్డాయి. అయితే స్కోరును సమం చేసేందుకు సౌదీ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మరోవైపు 82వ నిమిషంలో రొబర్ట్ పోలండ్‌కు రెండో గోల్‌ను అందించాడు. దీంతో జట్టు ఆధిక్యం 20కు పెరిగింది. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న పోలండ్ ఘన విజయం సాధించింది.

FIFA 2022: Poland beat Saudi by 2-0

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News